తెలంగాణ లో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు తరువాత   కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య  రోజుకింత పెరుగుతున్నాయి . లాక్ డౌన్ ఆంక్షల సడలింపు అనంతరం ప్రజలు కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందన్న వాదనలు విన్పిస్తున్నాయి .  గురువారం ఒక్కరోజే 117 కరోనా కేసులు నమోదు కావడం   ఆందోళన కలిగిస్తోంది . తెలంగాణకు చెందిన 66 మంది కరోనా బారిన పడగా , విదేశాలకు చెందిన 49 మంది కరోనా వ్యాధి సోకినట్లు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు . ఇక ఇద్దరు వలస కూలీలు కూడా కరోనా బారిన పడినట్లు తెలిపారు .

 

నగరం లోని పహాడీ షరీఫ్ ప్రాంతం లో ఒక మటన్ వ్యాపారి కరోనా బారిన పడ్డాడు . ఈ విషయాన్ని తెలియని  సదరు మటన్  వ్యాపారి , ఒక గెట్ టూ గెదర్ పార్టీకి హాజరుకావడం తో , ఆ పార్టీకి హాజరయిన 21 మంది కరోనా బారిన పడ్డారు .  ఇక కుత్బుల్లాపూర్ ప్రాంతం లో తల్లికి కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ , చిన్నారి కరోనా వల్ల మృతి చెందడం అందర్నీ విస్మయానికి గురి చేసింది . చిన్నారికి ఎలా కరోనా వ్యాధి సోకిందన్నది అంతుచిక్కడం లేదు . లాక్ డౌన్ ఆంక్షలు సడలించక ముందు  కరోనా క్రమేపి కట్టడి అవుతున్నట్లు కనిపించినప్పటికీ , ప్రస్తుతం కేసులు సంఖ్య విస్తృతంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది .

 

ఇప్పటివరకు గ్రీన్ జోన్ ఉన్న ప్రాంతాలు కూడా రెడ్ జోన్ , కంటైన్ మెంట్ జోన్లుగా మారుతుండడం తో అధికారులకు కూడా ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది . కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇలాగే పెరిగితే మళ్లీ లాక్ డౌన్ పొడగించడంతో పాటు , ఆంక్షలను కఠినంగా అమలు చేసే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయని వైద్యారోగ్య శాఖ  అధికారులు చెబుతున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: