తెలుగుదేశం పార్టీ అసలే నానా కష్టాలు పడుతోంది. గత ఎన్నికల్లో ఓడిపోయి కిందా మీదా అవుతోంది. పార్టీకి చరిత్రలో ఎన్నడూ కనీ వినీ ఏరగని ఓటమి దక్కింది. నేనేం తప్పు చేశాను అని చంద్రబాబు ఇప్పటికీ జనాలను అడుగుతున్నారు. కానీ జనం తీర్పు ఇచ్చేసి ఏడాది అయిపోయింది.

 

వారు మళ్ళీ అయిదేళ్లకు కానీ పలకరు. ఇక తెలుగుదేశానికి ఓటములు కొత్త కాదు కానీ ఇలాంటి ఓటమి బాగా కొత్తే. దానికి తోడు పార్టీలో నేతలు పక్క చూపులు చూస్తున్నారు. దాంతో పార్టీని మరో నాలుగేళ్ళు నెట్టుకురావడం ఎలా అన్నది అతి పెద్ద ప్రశ్నగా ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే తెలుగుదేశం పార్టీని మొదటి నుంచి వైసీపీ గురిపెట్టి సంధిస్తున్న ప్రశ్నే ఇపుడు జనసేన నాయకుడు నాగబాబు కూడా వేసి గుండెల్లో గునపాలు గుచ్చారు.

 

సహజంగా నాగబాబు ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు. ఆయన‌కు ఈ రాజకీయాలు, లౌక్యాలు, దాగుడు మూతలు అసలు తెలియవు. అందుకే ఆయన ఘాటుగా బాలక్రిష్ణ మీద వ్యాఖ్యలు చేశారు. ఆ గొడవలో ఆయన అమరావతి భూముల ప్రస్తావన కూడా తీసుకువచ్చారు. నిజానికి అమరావతి భూముల విషయంలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అని ఇప్పటికి ఆరేళ్ళుగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి విధితమే.

 

ఇపుడు అదే మాట నాగబాబు నోట రావడమే విశేషం. ఇన్సైడ్ ట్రేడింగ్ అన్న మాట వైసీపీ ఎన్నో సార్లు ప్రయోగించి టీడీపీని బాగా గుచ్చేసింది. ఇపుడు నాగబాబు లాంటి వారు అనడంతో సహజంగానే ఆ ఆరోపణలకు మరింత విలువ వస్తుంది. ఇక నాగబాబు ఒక డిబేట్ లో మాట్లాడుతూ తాము అమరావతి రైతుల పోరాటానికి మద్దతు ఇవ్వడానికి వెళ్ళినపుడు వారు అక్కడ చెప్పిన మాటలు కూడా ఇవేనని అన్నారు.

 

అమరావతి విషయంలో టీడీపీ నేతలు  రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని కూడా నాగబాబు అంటున్నారు. చంద్రబాబును తెలుగుదేశాన్ని నమ్మినందుకు ఏపీని సర్వనాశనం చేశారని కూడా ఆయన అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే నాగబాబు బాలయ్యని టార్గెట్ చేస్తూ అమరావతి భూములు కెలకడంతో ఇపుడు టీడీపీ మీద పెద్ద బాంబు పడ్డట్టు అయింది. మరో వైపు వైసీపీ వాదన నిజం అని కూడా తేలేలా ఈ వ్యాఖ్యలు ఉండడంతో పసుపు పార్టీ ఇరకాటంలో పడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: