గత కొంతకాలంగా జగన్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకున్నా హైకోర్టులో ఆ నిర్ణయాలకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. హైకోర్టు ఇచ్చిన పలు తీర్పులను సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకుంది. అయితే భూముల వేలానికి సంబంధించిన విషయంలో మాత్రం హైకోర్టు జగన్ సర్కార్ కు శుభవార్త చెప్పింది. ఏపీ ప్రభుత్వం బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూములను విక్రయించాలని నిర్ణయం తీసుకోవడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 
 
హైకోర్టు ఈ పిటిషన్ ని విచారణలో భాగంగా ఏపీ ప్రభుత్వం దివాళా తీసిందా...? ప్రభుత్వ భూములను విక్రయించి ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలా...? అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ పిటిషన్ విషయంలో జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపించాయి. కానీ హైకోర్టు విశాఖ, గుంటూరు జిల్లాల్లోని తొమ్మిది చోట్ల భూముల వేలానికి సంబంధించిన ప్రక్రియను కొనసాగించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
 
కోర్టు టెండర్లను ఖరారు చేయొద్దని ప్రభుత్వనికి సూచిస్తూ పిటిషన్ ను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు వేలం గడువును పొడిగించాలని విజ్ఞప్తులు రావడంతో ఇటు భూముల వేలంను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం విక్రయించదలచిన భూముల్లో గతంలో దాతలు ఇచ్చినవి ఉన్నాయని..... వాటిని విక్రయించడానికి వీల్లేదని గతంలో పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వం విక్రయించేందుకు సిద్ధమైన భూములన్నీ ఖాళీ స్థలాలు అని ప్రభుత్వం తరపు లాయర్ కోర్టులో వాదనలు వినిపించారు. 
 
ప్రస్తుతం 9 చోట్ల భూముల వేలానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జగన్ సర్కార్ కు ఊరట లభించింది. హైకోర్టు భూముల వేలానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం టీడీపీకి షాక్ అనే చెప్పాలి. బిల్డ్ ఏపీలో భాగంగా ప్రభుత్వం ప్రభుత్వ భూములను గుర్తించి, భవన సముదాయాలు నిర్మించే తలంపులో ఉంది. మిగతా భూముల్లో మౌలిక వసతులను కల్పించాలని నిర్ణయం తీసుకోవడంతో పాటు మార్కెట్‌ ధరకు ప్రైవేట్‌ వ్యక్తులు, సంస్థలకు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం బిల్డ్‌ ఏపీ మిషన్‌ డైరక్టర్‌గా ప్రవీణ్‌కుమార్‌ను నియమించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: