తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ ఆగడం లేదు. రాష్ట్రంలో గత రెండు రోజులుగా నూటికి పైగా కేసులు నమోదవుతున్నాయి. మొన్న 107 కేసులు నమోదు కాగా నిన్న 117 కేసులు నమోదు కావడంతో ప్రజల్లో భయాందోళన అంతకంతకూ పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే నలుగురు కరోనా భారీన పడి మృతి చెందడంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 67కు చేరింది. కరోనా విజృంభణ నేపథ్యంలో పాఠశాలలను దశల వారీగా తెరవాలని విద్యాశాఖ యోచిస్తోంది. 
 
రాష్ట్రంలో ఈ నెల 8వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. అందువల్ల పరీక్షలు జరిగే సమయంలో బడులు తెరిచే అవకాశం లేదు. విద్యాశాఖ జులై 5వ తేదీ తరువాత బడులు తెరవాలని యోచిస్తోంది. మొదట 8, 9, 10 విద్యార్థులకు తరగతులను ప్రారంభించాలని  భావిస్తోంది. దానివల్ల భద్రతాపరంగా లోపాలుంటే బయటపడే అవకాశం ఉంది. 
 
మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈరోజు మధ్యాహ్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం తర్వాత విద్యా సంవత్సరం ప్రారంభం గురించి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి ఆదేశాలు జారీ అయిన తరువాతే విద్యా సంవత్సరం ప్రారంభం గురించి తుది ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. అధికారులు బడులు తెరవడం గురించి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారని తెలుస్తోంది. 
 
తల్లిదండ్రులు, మేధావులు, విద్యావేత్తలు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సలహాలను కూడా స్వీకరించాలని విద్యాశాఖ భావిస్తోంది. విద్యాశాఖ మొదట ఉపాధ్యాయులు విధులకు హాజరై పాఠశాలలను సన్నద్ధం చేయడంతో పాటు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బడి ప్రణాళికను రూపొందించనుంది. ప్రాథమిక పాఠశాలలను ఆలస్యంగా ప్రవేశపెట్టాలని విద్యాశాఖ భావిస్తోంది. విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్, మాస్కులు తప్పనిసరి చేయడంతో పాటు బడి ముగిశాఖ ఒకేసారి కాకుండా 5 - 10 నిమిషాల వ్యవధిలో ఒక్కో తరగతి విద్యార్థులను పంపాలని భావిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: