ఓవైపు మహానాడు. మరోవైపు ఎన్టీఆర్ జయంతి.. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అందులోనూ  తెలుగు సినీ పరిశ్రమ పెద్దలపై తనను మీటింగులకు పిలవలేదన్న కారణంగా మండిపడటం కూడా బాగా వార్తల్లోకి ఎక్కింది. మహానాడులో బాలయ్య మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో ఉండదు. ప్రభుత్వం పడిపోతుంది.. మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని అన్నట్టు వార్తలు వచ్చాయి. 

 


ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పడిపోతుందని హిందూపురం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎలా మాట్లాడుతారని వైసిపి ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ ప్రశ్నించారు. బాలకృష్ణ తన మానసిక స్థితికి సంబంధించి మరోసారి చెక్‌ చేయించుకోవాలని ఇక్బాల్ సలహా ఇచ్చారు. సినీ పరిశ్రమ చర్చలకు పిలవలేదన్న బాధ బాలకృష్ణలో కనిపిస్తోందన్నారు.

 


ఈ ఇక్బాల్ హిందూపురంలో బాలయ్యపై పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆయనే ఇప్పుడు బాలయ్యపై విమర్శలు గుప్పించారు.  వైఎస్సార్‌సీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న సంగతి బాలయ్యకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ  గేట్లు తెరిస్తే టీడీపీ ఖాళీ అవుతుందని సీఎం జగన్‌ ఏనాడో చెప్పారని ఇక్బాల్ గుర్తు చేశారు. విలువలకు కట్టుబడి సీఎం జగన్‌ పాలన సాగుతుందని ఇక్బాల్ చెప్పారు.  

 


మహానాడుపైనా ఇక్బాల్ విమర్శలు గుప్పించారు. టీడీపీ అధ్యక్షుడు నిర్వహిస్తోంది మహానాడా లేక జూమ్‌ నాడా అని వ్యంగ్యంగా అన్నారు. తనకు కోటి ఆశలతో ఓటేసి గెలిపించిన హిందూపురం ప్రజలను బాలకృష్ణ పట్టించుకోవడం లేదని ఇక్బాల్ ఆరోపించారు. గతంలో బాలయ్య ఓ సినీ నిర్మాతపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తన మానసిక పరిస్థితి బాగోలేదని కథనాలు వచ్చాయి. ఆ నేపథ్యంలోనే ఇక్బాల్ ఈ వ్యాఖ్యలు చేసినట్టున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: