ఏపీలో కొద్ది రోజులుగా అధికార వైసీపీ తీసుకుంటోన్న నిర్ణ‌యాలు సంచ‌ల‌నానికి మారు పేరుగాను, వివాస్ప‌దంగాను ఉంటున్న‌ట్టు ఉన్నాయి. సీఎం జ‌గ‌న్ ఏ విష‌యంలో అయినా చాలా స్పీడ్ స్పీడ్‌గా తీసుకుంటోన్న నిర్ణ‌యాల‌పై కోర్టు నుంచి వ్య‌తిరేకంగా తీర్పు రావ‌డంతో ప్ర‌భుత్వం ఇబ్బందుల్లో ప‌డ‌క త‌ప్ప‌డం లేదు. తాజాగా జ‌గ‌న్ స‌ర్కార్‌కు హైకోర్టులో మ‌రో ఎదురు దెబ్బ తగిలింది. ఏపీ మాజీ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ తొల‌గింపుపై హైకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇప్పుడు ఏపీలో పెద్ద సంచ‌ల‌నంగా మారింది. ఆయ‌న వెంట‌నే విధుల్లోకి వెళ్లాలంటూ కూడా కోర్టు తీర్పు ఇవ్వడం చూస్తే ఇది అధికార వైసీపీతో పాటు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి కాస్త ఎదురు దెబ్బ లాంటిదే అని చెప్పాలి.

 

జ‌గ‌న్ ప్ర‌భుత్వం స్తానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో మంచి దూకుడు మీద ఉంది. వైసీపీ ఒక్క‌సారిగా ఏక ప‌క్ష విజ‌యాల‌తో.. ఏక‌గ్రీవాల‌తో జోరు మీద ఉండ‌గానే అప్పుడు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ గా ఉన్న ర‌మేష్ కుమార్ ఎన్నిక‌ల‌ను క‌రోనా పేరుతో వాయిదా వేశారు. అయితే అప్ప‌ట‌కీ క‌రోనా ఉన్నా ఏపీలో అంత జోరు మీద లేదు అన్న‌ది వైసీపీ ప్ర‌భుత్వం ఆరోప‌ణ‌. చివ‌ర‌కు జ‌గ‌న్ ర‌మేష్ కుమార్‌ను త‌ప్పించి ఆ స్థానంలో త‌మిళ‌నాడుకు చెందిన క‌న‌గ‌రాజ్‌ను ఏపీ ఎన్నిక‌ల అధికారిగా నియ‌మించారు.

 

ఇక జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఈ క్ర‌మంలోనే నిమ్మ‌గ‌డ్డ పదవి కాలాన్ని మూడేళ్లకు తగ్గిస్తూ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిన సంగతి తెలిసింది.. దీనికి గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. తర్వాత రాష్ట్ర న్యాయ శాఖ ఆమోదం తెలపింది. ఆ వెంట‌నే న్యాయ శాఖ జీవో 31, పంచాయతీరాజ్ శాఖ 617, 618 జీవోలు ఇచ్చాయి. అయితే ఈ మార్పు రాజ్యాంగంలోని నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఉంద‌ని చెప్పిన కోర్టు వెంట‌నే క‌న‌గ‌రాజ్‌ను త‌ప్పిస్తూ నిమ్మ‌గ‌డ్డ‌కు ప‌ద‌వీ కాలం ఇవ్వాల‌ని తీర్పు చెప్పింది. ఇక ఆ వెంట‌నే నిమ్మ‌గ‌డ్డ కోర్టు ఆదేశాల‌తో తాను తిరిగి విధుల్లో చేరుతున్నాన‌ని చెప్పారు.

 

ఇక అటు సీఎస్ నీలం సాహ్నీ కూడా వ‌రుస‌గా రెండో రోజు కోర్టుకు హాజ‌ర‌య్యారు. ప్ర‌భుత్వ ఆఫీసుల‌కు రంగులు వేయ‌డంపై వ‌రుస‌గా రెండో రోజు కూడా ఆమె వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సిన ప‌రిస్థితులు వ‌చ్చాయి. ఏదేమైనా దూకుడు నిర్ణ‌యాల‌తో జ‌గ‌న్ కు వైసీపీ ప్ర‌భుత్వానికి వ‌రుస‌గా కోర్టుల్లో ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి. ఇక‌పై అయినా జ‌గ‌న్ వ్యూహం మార్చుకుని ప్ర‌తి విష‌యంలో ఆలోచ‌న‌తో ముందుకు అడుగులు వేయాల్సిన అవ‌స‌రం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: