ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైంది. ఈ సంవత్సర కాలంలో జగన్ సర్కార్ సంక్షేమ పథకాల అమలుతో ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. రాష్ట్రంలో జగన్ ఏడాది పాలనపై నిర్వహించిన పలు సర్వేల్లో మెజారిటీ ప్రజలు జగన్ పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల్లో జగన్ కు మంచి పేరు వస్తున్నా హైకోర్టులో మాత్రం ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. 
 
తాజాగా జగన్ సర్కార్ ఆర్డినెన్స్ ద్వారా తొలగించిన నిమ్మగడ్డ రమేశ్ ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జగన్ ఆర్డినెన్స్ ద్వారా ఎన్నికల కమిషనర్ ను తొలగించడం, హైకోర్టు రిటైర్డ్ జడ్జీ కనగరాజ్ ను ఎన్నికల కమిషనర్ గా నియమించడం అప్పట్లో రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎన్నికల కమిషనర్ పదవి నుంచి ప్రభుత్వం తొలగించడంతో రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయింగా ఈరోజు తీర్పు వెలువడింది. 
 
హైకోర్టు తీర్పు ఆనంతరం సీఎం జగన్ ఇకముందు జాగ్రత్త పడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో కోర్టుల నుంచి వరుస షాకులు తగిలాయని... ఆ తరువాత నిర్ణయాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో ఆ తరువాత కోర్టులో అనుకూలమైన తీర్పులే వచ్చాయని చెబుతున్నారు. జగన్ సర్కార్ ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగలకుండా జాగ్రత్త పడాల్సి ఉంది. 
 
కీలక నిర్ణయాల విషయంలో న్యాయ నిపుణుల సలహాలు, సూచనలతో జగన్ సర్కార్ ముందుకెళితే బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికార పక్షానికి వ్యతిరేకంగా వస్తున్న తీర్పులు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి మేలు చేకూరుస్తున్నాయని... రాష్ట్రంలో సుపరిపాలన సాగిస్తున్న జగన్ కీలక నిర్ణయాల విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. తాజా తీర్పు నేపథ్యంలో జగన్ హైకోర్టు తీర్పు గురించి అధికారులు, న్యాయనిపుణులతో చర్చించనున్నారని సమాచారం అందుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: