వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే జగన్ అనేక సంచలన నిర్ణయాలు తీసుకొని అమలు చేశారు. అలాగే ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. మరో నాలుగేళ్లపాటు తనకు ఎదురు లేకుండా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే అన్ని విభాగాల్లోనూ తన మాట వినే వ్యక్తులను అధికారులుగా జగన్ నియమించుకున్నారు. గత టిడిపి ప్రభుత్వ పెద్దలతో సాన్నిహిత్యం ఉన్న వారు ఎవరినీ కీలక విభాగాల్లో ఉంచకుండా, బదిలీని బహుమానంగా ఇచ్చారు. ఇది ఇలా ఉంటే ఒక పక్క రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసే విధంగా కష్టాలు చుట్టుముట్టాయి. అసలే అప్పుల్లో ఉన్న ఏపీ లో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను జగన్ అమలు చేస్తున్నారు. దీనికోసం వేల కోట్ల ఖర్చు పెడుతున్నారు.ఇప్పుడు కరోనా కారణం వాటిని కొనసాగించలేక నిలుపుదల చేయలేక ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్నారు. ఇదే సమయంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలపై ఇప్పుడు వరుసగా హైకోర్టులో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి.

IHG

ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కోర్టు తప్పుబడుతూ వస్తుండడం, వాటిపై వెనక్కి తగ్గకుండా సుప్రీంకోర్టుకు ప్రభుత్వం వెళ్లడం పరిపాటిగా మారింది. ప్రభుత్వ భవనాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగులు పోలిన విధంగా రంగులు వేయడం వివాదాస్పదమైంది. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీం కు వెళ్లినా హై కోర్ట్ తీర్పునే సుప్రీంకోర్టు సమర్ధించింది. అలాగే రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాలకు చెందిన వారికి ఇళ్ల స్థలాల కేటాయింపు నిమిత్తం జారీచేసిన 107 జీవోపై స్టే ఇచ్చింది. అలాగే రాజధాని భూములను వెనక్కి తీసుకుంటూ ఇచ్చిన జీవో నెంబర్ 44 పైన కూడా కోర్టు స్టే విధించింది. ఇక  విశాఖ లో మత్తు వైద్యులు సుధాకర్ వ్యవహారంలో ప్రభుత్వం, పోలీసుల తీరును హైకోర్టు తప్పు పట్టింది. ఏకంగా ఈ వ్యవహారంపై సిబిఐ విచారణకు ఆదేశించింది.


ఇక స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిర్ణయం తీసుకోవడంపైన ఆగ్రహం చెందిన ప్రభుత్వం ఏకంగా ఆయనను తప్పించి కొత్త ఈసీ ని నియమించింది. ఈ వ్యవహారం చాలా వివాదాస్పదం కావడం, కోర్టు మెట్లు ఎక్కడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వెలువడడం అన్నీ జరిగిపోయాయి. రమేష్ కుమార్ తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే గత టీడీపీ ప్రభుత్వం లో ఇంటలిజెన్స్ బాస్ గా పనిచేసిన ఏబీ  వెంకటేశ్వరరావును ప్రభుత్వం సస్పెండ్ చేయడంపైన హైకోర్టు ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. ఆయన్ని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతి విషయంలో వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, దాన్ని కోర్టులు తప్పు పట్టడం పరిపాటిగా మారిపోయింది.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: