తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తుంటే మరోవైపు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే మూడు నుంచి ఎనిమిది డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోహిణి కార్తెలో సూర్యుడి మంటలతో తెలంగాణ నిప్పుల కొలిమిలా మారిపోయింది. 
 
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచిస్తోంది. పలు జిల్లాల్లో వడగాలులు వీచే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. 
 
చత్తీస్ ‌గఢ్‌ రాష్ట్రం నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు వరకూ 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ చెబుతోంది. ఎండల తీవ్రత వల్ల పొడి వాతావరణం ఏర్పడుతుందని తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 46 డిగ్రీల సెల్సియస్‌‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు తెలుస్తోంది. ఎండ వేడిమికి తోడు వడగాలులు వీస్తుండటంతో జనం అల్లాడుతున్నారు. 
 
వడదెబ్బ తగిలి రాష్ట్రంలో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. భానుడి ఉగ్రరూపానికి తెలంగాణ విల్లవిల్లాడుతోంది. రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు కూడా భారీగా పెరిగాయి. ఉపాధి హామీ కూలీలు, చిరు వ్యాపారులు, చిన్నారులు, వృద్ధులు ఉష్ణోగ్రతల తీవ్రతకు అల్లాడిపోతున్నారు. వైద్యులు ప్రజలు ఎండ వేడిమి భారీన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. బయటకు వెళ్లే సమయంలో వదులైన, పలుచని కాటన్ దుస్తులు ధరించాలని... తలకు టోపీ లాంటివి పెట్టుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.                           

మరింత సమాచారం తెలుసుకోండి: