సంచలనం సృష్టించిన కర్నూలు బాలిక హత్య కేసు సీబీఐ  చేతికి వెళ్లింది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం  మరో జీవో జారీ చేసింది. దీంతో ఇప్పటికైనా  న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మృతురాలి బంధువులు. 

 

కర్నూలు కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో పదో తరగతి  చదువుతున్న బాలిక మృతి మిస్టరీ మూడేళ్లైనా వీడలేదు. కమిటీల మీద కమిటీలు, విచారణ మీద విచారణలు చేస్తున్నా అసలు విషయం నిర్ధారణ కాలేదు. పదో తరగతి చదువుతున్న బాలికను  స్కూల్ యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తలే అత్యాచారం చేసి హత్య చేశారనేది తల్లిదండ్రుల ఆరోపణ.  పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్  నివేదిక విరుద్ధంగా ఉండడం ఈ అనుమానాలకు ప్రధాన కారణం. 2017 ఆగస్టు 19న హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని అనుమానాస్పద స్ధితిలో చనిపోయింది బాధితురాలు. అయితే ఆమె శరీరంపై గాయాలున్నాయని.. అత్యాచారం ‌ చేసి చంపేశారని తల్లిదండ్రులతో పాటు దళిత సంఘాలు ఆరోపించాయి. యాజమాన్యంపై కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి ఎన్నో కమిటీలు దర్యాప్తు చేపట్టాయి. ముగ్గురు వైద్య నిపుణుల కమిటీ కూడా అత్యాచారం జరగలేదని నివేదిక ఇచ్చింది. 

 

ఈ ఘటనపై ఆందోళనలు సాగడంతో పాటు జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు వెళ్లడంతో  సీఐడీతో విచారణ జరిపించాలని ఆదేశించింది. ఇటు హోం మంత్రి సుచరితకు, డీజీపీకి కూడా ఫిర్యాదు చేయడంతో ఐపీఎస్ అధికారి రమాదేవిని విచారణ అధికారిగా నియమించి పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించారు. 

 

యాజమాన్యమే కారణమని మృతురాలి పేరెంట్స్‌ ఆరోపిస్తుంటే ఎలాంటి సంబంధం లేదని వీరు చెబుతున్నారు. ఇలా మూడేళ్లు గడిచిపోయాయ్‌. ఇటీవల జనసేన అధినేత పవన్‌ కూడా ఫిబ్రవరి 12న కర్నూలులో నిరసన కవాతు చేశారు. దానికి ముందు రోజే సీబీఐకు కేసు అప్పగించేందుకు హోం శాఖకు ప్రతిపాదన పంపినట్టు పోలీసులు ప్రకటించారు. ఇటు ఆమె తల్లిదండ్రులు కూడా జగన్‌ను కలిసి విజ్ఞప్తి చేయడంతో సిబిఐకి అప్పగిస్తూ ఫిబ్రవరి 27న జీవో నెంబర్‌ 37 విడుదల చేశారు. తాజాగా దర్యాప్తునకు వీలుగా అనుమతిస్తూ జీవో నెంబర్‌ 56 జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. సీబీఐ దర్యాప్తుతో తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు మృతులురాలి బంధువులు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: