అదేంటో వైఎస్ జగన్ కి ఆది నుంచి కష్టాలే. పదేళ్ళు కష్టపడితే కానీ అధికారం దక్కలేదు. పోనీ అధికారంలో కుదురుకుందామనుకుంటే హానీ మూన్ టైం కూడా ఇవ్వకుండా ఏపీలో విపక్షాలన్నీ దాడి మొదలెట్టాయి. జగన్ కి మెజారిటీ సెక్షన్ ఆఫ్ మీడియా యాంటీ అన్నది తెలిసిందే.

 

ఇక రాజకీయ పార్టీలు మూకుమ్మడిగా దాడిచేయడం బహుశా దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఉండదు, ఇది రాజకీయం అనుకున్నా కూడా దానిని మించి  వ్యక్తిగత ద్వేషం ఏదో ఉందేమో అనిపించేలా ఏపీలో  పొలిటికల్ సీన్ ఉంది. ఇక జగన్ ఏడాది కాలంలో ఎన్నో మంచి పనులు చేశారు. వాటి గురించి చెప్పుకోవడానికి లేకుండా కోర్టు తీర్పులు వ్యతిరేకంగా రావడంతో చర్చ అంతా అటువైపుగా మళ్ళుతోంది.

 

ఈ నెల 30కి జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఏడాది అవుతోంది. ఆ సంబరాలు గట్టిగా చేసుకోవడానికి కరోనా మహమ్మారి ఒకటి ఉంది. దాంతో సమీక్షలతో సరిపెడుతున్నారు. ఇక ఉన్నదాంట్లో ఆనందం లేకుండా వ్యతిరేక తీర్పులు జగన్ తో పాటు వైసీపీ ఆనందాన్ని ఆవిరి చేస్తున్నాయని అంటున్నారు. 

 

గత వారంగా చూసుకుంటే వరసగా నాలుగు తీర్పులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చాయి. దాంతో ప్రభుత్వంలో దీని మీద చర్చ వాడిగా వేడిగా సాగుతోంది. అసలు ఎందుకిలా జరుగుతోంది. జగన్ టీం లో లీగల్ ఎక్స్ పెర్ట్స్  లేరా, రాజ్యాంగపరమైన విషయాల మీద క్షుణ్ణంగా అవగాహన కలిగిన వారు లేరా అన్న అభిప్రాయం కూడా వస్తోంది.

 

ఏది ఏమైనా రాజ్యాంగాన్ని, కోర్టు తీర్పులను గౌరవిస్తూ దానికి తగినట్లుగా పాలన చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ పరిణామాలు తెలియచేస్తున్నాయి మరి చూడాలి ఇకనైనా వైసీపీ సర్కార్ పెద్దలు ఆ దిశగా అడుగులు వేస్తారేమో. అభిమానులు కూడా జగన్ పాలన మీద వ్యతిరేకత ఏ విధంగా వచ్చినా కూడా తట్టుకోలేకపోతున్నారు. వారు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితి మారాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: