జేసీ దివాకర్ రెడ్డి...రాజకీయాల్లో విలక్షణ నేత. ఎప్పుడు ఎవరిని ఎలా విమర్శిస్తారో తెలియదు. అవసరమైతే సొంత పార్టీని విమర్శిస్తారు...లేదంటే ప్రత్యర్ధి పార్టీని పొగుడుతారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న జేసీ దివాకర్ రెడ్డి...తన ప్రత్యర్ధి అయిన జగన్‌ని పొగుడుతూనే, చురకలు కూడా అంటిస్తూ ఉంటారు. తాజాగా కూడా అదే పని చేశారు. ఏపీకి జగన్ లాంటి ముఖ్యమంత్రి మళ్లీ దొరకడని, జగన్ ఏడాది పాలనకు వందకు 110మార్కులు వేస్తానని ఎద్దేవా చేశారు.

 

తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనటాన్ని జగన్ మానుకోవాలని, జగన్ శ్రీరాముడో.. రావణుడో ప్రజలే తేల్చుకోవాలని అన్నారు. అయితే జగన్‌కు చురకలు అంటిస్తూనే, పరోక్షంగా కీలక సలహ కూడా ఇచ్చారు. చరిత్ర అనే పుస్తకంలో తనకు ఒక్క పేజీ ఉండాలనేది జగన్ ఆలోచన అని, వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం జగన్ సంక్షేమంపై దృష్టిసారించారని, సంక్షేమానికి ఓట్లు పడవన్న విషయం 2019లో తేలిందని  చెప్పారు.

 

అయితే ఇక్కడ జగన్ సంక్షేమంపై ఎక్కువగానే దృష్టి పెట్టారు. ఏ సీఎం చేయని విధంగా ఒక సంవత్సరంలోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. కానీ సంక్షేమ పథకాలకు ఓట్లు పడవని జేసీ అంటున్నారు. 2019 ఎన్నికల్లో కూడా అదే జరిగిందని అన్నారు. అంటే చంద్రబాబు కూడా సంక్షేమ పథకాలు బాగానే అమలు చేశారని, కానీ అవేమీ వర్కౌట్ కాలేదని అర్ధం వచ్చేలా చెప్పారు.

 

జేసీ చెప్పినట్లు చంద్రబాబు కూడా సంక్షేమ పథకాలు బాగానే అమలు చేశారు. కానీ కరెక్ట్ టైమ్‌లో అమలు చేయలేదు. రైతు రుణమాఫీ లాంటి అంశంలో భారీ కోత పెట్టారు. అలాగే ఎన్నికల ముందు డ్వాక్రా రుణమాఫీని వదిలేసి, పసుపు కుంకుమ పేరిట 20 వేలు ఇచ్చారు. అలాగే ఇంకా పలు పథకాలు పెట్టారు. అందుకే ప్రజలు బాబుని నమ్మలేదు. జగన్‌ని గెలిపించుకున్నారు. ఇప్పుడు జగన్ చెప్పిన సమయానికి పథకాలు అమలు చేస్తున్నారు. ఒక సంవత్సరంలోనే మేనిఫెస్టోలో ఇచ్చిన 80 శాతం హామీలని అమలు చేసేశారు. కాబట్టి సంక్షేమం విషయంలో జగన్‌కు మంచి మార్కులే పడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: