ఏపీ ప్రభుత్వం ఎలక్షన్ కమిషనర్ పదవి కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ రావడంతో అప్పుడు ఎస్‌ఈసిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవిని కోల్పోయారు. దీంతో కొత్త ఎస్‌ఈసిగా కనగరాజ్ వచ్చారు. అయితే తనని అక్రమంగా తొలగించారని నిమ్మగడ్డ హైకోర్టుకు వెళ్లారు. అలాగే టీడీపీ, బీజేపీ నేతలు నిమ్మగడ్డ సపోర్ట్‌గా పిటిషన్లు వేశారు.

 

ఈ పిటిషన్లు విచారించిన హైకోర్టు ప్ర‌భుత్వ ఆర్డినెన్స్ జీవోల‌ను ర‌ద్దు చేస్తూ తీర్పు వెలువ‌రించింది.  వెంటనే రమేష్ కుమార్‌ని ఈసీగా కొనసాగించాలని ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టీడీపీ,బీజేపీ, జనసేన నేతలు హర్షం వ్యక్తం చేస్తుండగా, వైసీపీ నేతలు హైకోర్టు తీర్పుని గౌరవిస్తామని చెబుతూనే, న్యాయం కోసం సుప్రీం కోర్టుకు కూడా వెళతామని చెబుతున్నారు.

 

ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా తిరిగి నియమించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ‌తామ‌ని రాంబాబు చెప్పారు. ఒక్కో స‌మ‌యంలో న్యాయం జ‌ర‌గ‌క‌పోవ‌చ్చని, అలాంట‌ప్పుడు పై కోర్టుకు వెళ్లే అవ‌కాశం ఉందని, దానిపై న్యాయ‌నిపుణుల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నామ‌ని తెలిపారు.

 

సరే హైకోర్టు తీర్పు ఇచ్చింది..కానీ ఇక్కడ న్యాయం జరగలేదని సుప్రీంకు వెళ్తామని చెప్పడం వరకు బాగానే ఉంది. అయితే అంబటి ఇక్కడ ఊహించని అంశం ఒకటి చెప్పారు. స్థానిక సంస్థలకు జరగనున్న ఎన్నికలలో డబ్బు, మద్యం పంపిణీ జరగకూడదని, ఎవరైనా డబ్బు పంపిణీ చేసినట్టు రుజువైతే వారిపై అనర్హత వేటు వేయడంతోపాటు మూడేళ్ల జైలుశిక్ష విధించేలా జగన్ ప్రభుత్వం చట్టం చేసిన విషయం తెలిసిందే.

 

అయితే ఈ చట్టానికి వ్యతిరేకంగా చంద్రబాబు పంపిన లేఖపై నిమ్మగడ్డ సంతకం పెట్టారని, ఇటువంటి లేఖల వల్ల ప్రజాస్వామ్యం మంట కలిసిపోతుంద‌ని అంబటి కొంచెం ఘాటుగా మాట్లాడారు. కాకపోతే ఈ విషయం గురించి స్థానిక సంస్థల నోటిఫికేషన్ సమయంలో బయటకు రాలేదు. మద్యం, డబ్బులు పంచితే జైలు శిక్ష పడుతుందని చట్టం తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు లేఖ రాయడం, దానిపై నిమ్మగడ్డ సంతకం ఎప్పుడు పెట్టారో చెప్పాలని తెలుగు తమ్ముళ్ళు డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టు మొట్టికాయలు వేయడంతోనే అంబటి ఏదొక విమర్శ చేయాలని, ఇలా మాట్లాడుతున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: