లోకాన్ని కరోనా చుట్టేస్తున్న సమయంలో దాదాపు ప్రపంచమే స్దంభించి పోయింది.. ఇక ఇప్పుడిప్పుడే ప్రభుత్వం లాక్‌డౌన్ సడలింపులను చేస్తుంది.. ఈ నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను తిప్పడానికి అనుమతినిచ్చింది. కానీ నగరంలో ఇంకా కరోనా కేసులు ఊహించని విధంగా నమోదు అవుతుండటంతో సిటీ బస్సులకు పర్మిషన్ ఇవ్వలేదు.. ఇప్పటికే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పారిశ్రామిక కార్యకలాపాలు కూడా మొదలైన నేపథ్యంలో.. సిటీ బస్సులు లేకపోవటంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.  వీరితో పాటుగా సామాన్య ప్రజలు కూడా పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు..

 

 

ఈ సమయంలో ఆర్టీసీ అధికారుల మీద సిటీ సర్వీసులు ప్రారంభించాలన్న ఒత్తిడి పెరుగుతోందని తెలుస్తుంది.. దీంతో వచ్చే నెల మొదటి వారంలో నగరంలో సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎప్పుడు ప్రభుత్వం అనుమతి ఇస్తుందా అని వారి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న అధికారులు.. వాటిని ప్రారంభించేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారట. ఇక అధికారుల అంచనాల ప్రకారం వచ్చేనెల 5వ తేదీకి అటుఇటుగా బస్సులు ప్రారంభించే అవకాశం ఉందని ఆర్టీసీలో ప్రచారం జరుగుతోందట..

 

 

ఇదిలా ఉండగా ప్రస్తుత పరిస్దితుల్లో నగరంలో కరోనా పాజిటివ్‌ కేసులు విపరీతంగా వెలుగు చూస్తున్న నేపధ్యంలో, ముఖ్యంగా జియాగూడ, ఆసిఫ్‌నగర్, పాతబస్తీలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నందువల్ల ఈ ప్రాంతాలకు కాకుండా మిగతా ప్రాంతాలకు బస్సులు నడపాలని ఆర్టీసీ భావిస్తోందని తెలుస్తుంది. అదీగాక సికింద్రాబాద్, మేడ్చల్, రామచంద్రాపురం, హయత్‌నగర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మాదాపూర్‌.. తదితర ప్రాంతాల వైపు బస్సులను ఎక్కువగా తిప్పాలని భావిస్తోంది. కాగా, రేపటితో నాలుగో విడత లాక్‌డౌన్‌ ముగుస్తున్న నేపథ్యంలో కేంద్రం మరికొన్ని సడలింపులతో కొత్త మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది.

 

 

అయితే బస్సులను ప్రారంభించినప్పటికీ భౌతికదూరం పాటిస్తూ, శానిటైజర్లను తప్పని సరిగా ఉపయోగిస్తూ, తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రయాణాలు చేయాలని అధికారులు పేర్కొంటున్నారు.. ఏది ఏమైనప్పటికి సొంత వాహనాలు ఉన్న వారు వాటిని సాధ్యమైనంత వరకు ఉపయోగించుకుంటే మేలు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: