కరోనా వ్యాప్తికి చైనా వైఖరే కారణమని మొదటి నుంచి మండిపడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు ఆ దేశంపై.. దానికి వత్తాసు పలుకుతుందన్న కారణంతో ప్రపంచ ఆరోగ్య సంస్థపై కొరడా జుళిపించాడు. చైనా దేశానికి చెందిన కంపెనీలపై ఆంక్షలు విధించాడు.

అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజీలో నమోదై, తమ దేశ చట్టాలను గౌరవించని చైనా కంపెనీలపైనా చర్యలు తీసుకుంటామన్నారు.

 

 

అనేక చైనా కంపెనీలు అమెరికా చట్టాలని పాటించడం లేదని అమెరికా ఎప్పటి నుంచో గగ్గోలు పెడుతోంది. కానీ ద్వైపాక్షిక సంబంధాల దృష్ట్యా గట్టిగా స్పందించడం లేదు. కానీ కరోనా కారణంగా చైనాతో అమెరికా వ్యవహారం పూర్తిగా చెడిపోతున్నట్టే కనిపిస్తోంది. అందుకే ఏకంగా చైనాపై ఆంక్షలు విధించేందుకు అమెరికా రెడీ అయ్యింది. అంతే కాదు.. కరోనా విషయంలో చైనాతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కుమ్మక్కయిందని మొదటి నుంచి ఆరోపిస్తున్న ట్రంప్ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

 

 

ప్రపంచ ఆరోగ్య సంస్థతో అమెరికా పూర్తిగా తెగతెంపులు చేసుకుంటున్నట్లు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. కరోనా విషయంలో ఆ సంస్థతో పాటు చైనా కూడా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందన్నారు. ఈ మేరకు భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి వైట్ హౌజ్ లో మీడియాతో మాట్లాడారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాతో కుమ్మక్కై ప్రపంచ వ్యాప్తంగా అపార ప్రాణ, ఆర్థిక నష్టాలకు కారణమైందని ఆరోపించారు.

 

 

వైరస్ విషయంలో కీలక అంశాలను దాచిపెట్టినందుకు చైనాపై ఆంక్షలు విధిస్తున్నట్లు అప్పుడే ప్రకటించారు. ఇకపై ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఇచ్చే నిధులను ఇతర ప్రపంచ ప్రజారోగ్య సంస్థలకు మళ్లిస్తామని ట్రంప్‌ అంటున్నారు. అయితే ఇదంతా త్వరలో అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో మైలేజీ కోసం ట్రంప్ వేస్తున్న ఎత్తుగడలే అని విమర్శించే వారూ ఉన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: