వాతావరణ శాఖ వాన కబురు అందించింది. జూన్ ఒకటి నాటికే కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

 

అరేబియా సముద్రం... మాల్దీవులు... కోమోరిన్‌లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఆగ్నేయా అరేబియా సముద్రం...దాన్ని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఈనెల 31న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది రాగల 72 గంటల్లో ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణిస్తుంది. అరేబియా సముద్రంలో అల్పపీడనం.. వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావం వల్ల జూన్ 1న కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది.  

 

ఇక... ఇప్పటికే పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఇది రాగల 24 గంటల్లో వాయు గుండంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత మరింత బలపడనుంది. 

 

మరోవైపు...పశ్చిమ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు...మరఠ్వాడ...తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు...ఈదురు గాలులు వీస్తాయి. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శని...ఆదివారం కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయి. ఉరుములు, మెరుపులతో పాటు వడగండ్ల వానలు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

 

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వర్షం ఎప్పుడు పడుతుందా అని ఆశపడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను పలుకరించే గడియలు ఆసన్నమయ్యాయని చెప్పడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువులు, కుంటలు, నదులు పొంగిపొర్లుతే.. పంటలు పుష్కలంగా పండుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: