ధోని  టీమిండియాకు మళ్లీ ఆడతాడా ? మిస్టర్‌ కూల్‌ కెరీర్ ముగిసిందా? ఇవి ప్రతి భారతీయ అభిమాని మనసులో మెదలుతున్న ప్రశ్నలు. తన రిటైర్మెంట్‌పై ధోని స్పందించకపోవడంతో అతని ఫ్యాన్స్‌లో అయోమయం నెలకొంది.

 

ధోని రిటైర్మెంట్ ఎప్పుడు..?  గత కొద్ది నెలలుగా క్రికెట్‌ సర్కిల్‌లో ఎక్కువగా విన్పిస్తోన్న మాట. మిస్టర్‌ కూల్‌ అల్రెడీ ఆటకు గుడ్‌బై చెప్పాడంటూ నెట్టింట్లో వార్తలు కూడా చక్కర్లు కొట్టాయ్‌. ఇన్ని వార్తలు వచ్చినా వీటిపై మిస్టర్‌ కూల్‌ స్పందిచలేదు. టీమిండియాలో ధోనీ రిటర్న్స్ ఎప్పుడని క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. వారి కోసమైనా క్లారీటీ ఇవ్వలేదు జార్ఖండ్‌ డైనమైట్‌. ఎన్ని వార్తలు వచ్చినా.. మాజీ క్రికెటర్లు తనపై కామెంట్స్‌ చేసినా నోరు మెదపకుండా సైలెంట్‌గానే ఉన్నాడు ధోని.

 

వాస్తవానికి గతేడాది వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత ధోనీ రిటైర్మెంట్ ప్రకటించేస్తాడని అంతా ఊహించారు. బీసీసీఐ, సెలక్టర్లతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఆ తరహాలో సంకేతాలిచ్చారు. కానీ.. ధోనీ మాత్రం రిటైర్మెంట్ గురించి ఎన్ని వార్తలు వచ్చినా మౌనంగా ఉండిపోయాడు. దీంతో.. ఇప్పుడు అతని భవితవ్యంపై ఎవరికీ క్లారిటీ లేకపోయింది. టీమిండియా సెలక్షన్ కమిటీ అయితే..  జట్టు ఎంపికప్పుడు ధోనీ పేరుని ప్రస్తావించడం కూడా మానేసింది. టీమిండియాలోకి ధోనీ రీఎంట్రీ ఇవ్వాలంటే.. కనిపిస్తున్న ఏకైక అవకాశం ఐపీఎల్ 2020 సీజన్. కరోనా ఎఫెక్ట్‌తో ఈ ఏడాది ఐపీఎల్‌పై ఇంతవరకు క్లారీటీ రాలేదు. ఈ ఏడాది ఐపీఎల్‌ జరగకపోతే దాదాపు మిస్టర్‌ కూల్‌ కెరీర్‌ ముగిసినట్టేనని మాజీలు భావిస్తున్నారు. అతనికున్న ఏకైక దారి ఐపీఎల్‌ మాత్రమే.

 

ఇప్పటికే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ధోనీకి చోటు లభించలేదు. టీమిండియాకి ఆడుతున్న 27 మంది క్రికెటర్లకి సంబంధించిన వార్షిక కాంట్రాక్ట్‌ని ప్రకటించిన బీసీసీఐ.. ధోనీని పక్కనపెట్టేసింది. ఆరు నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉన్న ధోనీకి ఏ లెక్కన  కాంట్రాక్ట్ ఇవ్వాలంటూ బోర్డు ప్రశ్నించింది. వన్డే ప్రపంచకప్ తర్వాత బీసీసీఐ నుంచి అనుమతి తీసుకున్న ధోనీ.. వెస్టిండీస్ పర్యటనకి దూరంగా ఉండి భారత ఆర్మీతో కలిసి రెండు వారాలు పనిచేశాడు. కానీ.. ఆ తర్వాత కూడా భారత్ జట్టుకి కొన్ని రోజులు దూరంగా ఉండాలని ధోనీ నిర్ణయించుకున్నాడా..? లేదా సెలక్టర్లు పక్కన పెట్టారా..? అనే దానిపై క్లారిటీ లేదు. అయితే.. ఒకవేళ ధోనీ దేశవాళీ క్రికెట్‌లో ఆడి ఫామ్ నిరూపించుకుని ఉండింటే..? గత ఏడాదే టీమిండియాలోకి రీఎంట్రీ అవకాశం లభించేది.

 

బీసీసీఐ ధోని ఆలోచించడం మానేసి.. అతని స్థానంలో కీపర్‌గా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌ని ఆడించేస్తున్నారు. ఏడాది కాలంలో క్రికెట్‌ సర్కిల్‌లో ధోని రిటైర్‌ గురించి వచ్చిన వార్తలు అన్నీ ఇన్నీ కావు. దిగ్గజ క్రికెటర్ల నుంచి సగటు అభిమాని వరకు ప్రతి ఒక్కరూ అతని సమాధానం గురించి ఎదురు చూశారు. సోషల్‌మీడియాలో అయితే పెద్ద రచ్చే జరిగింది. ధోని రిటైర్‌ అయ్యాడంటూ వార్తలు షికార్‌ చేశాయ్‌. ఇంత రచ్చ జరుగుతున్నా ధోని మాత్రం సైలెంట్‌గానే ఉన్నాడు. మాజీ క్రికెటర్లు అతని వయస్సు గురించి కామెంట్స్‌ చేసినా పట్టించుకోలేదు మిస్టర్‌ కూల్‌. టీమిండియా చరిత్రలోనే ఆల్‌టైమ్‌ కెప్టెన్‌గా ధోనికి మంచి రికార్డుంది. తన నిర్ణయాలతో వరల్డ్‌కప్‌లను అందించిన ఘనత అతడిది. కానీ తన రిటైర్మెంట్‌ విషయంలో మాత్రం ఇంతవరకు నిర్ణయం తీసుకోకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

 

ఒకవేళ టీ-20 మెగాటోర్ని రద్దై.. ఐపీఎల్‌ జరిగితేనే ధోనికి జట్టులోకి మరోసారి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందనడానికి వీల్లేదు. ఐపీఎల్‌లో కూడా ధోని తన ఫామ్‌ను అందుకోని..బ్యాటింగ్‌లో సత్తా చాటాలి. ఇదే టైంలో తనకు పోటీదారులైన రాహుల్, పంత్‌లు విఫలమవ్వాలి. ఇన్ని జరిగితేనే ధోని జట్టులో చోటు ఆశించవచ్చు. లేకపోతే ఇక క్రికెట్‌కు గుడ్‌బై చెప్పొచ్చు. ఇలా సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలవడం కన్నా.. తన రిటైర్‌పై ఏదో ఒకటి తేల్చుకుంటే మంచిదంటున్నారు క్రికెట్‌ నిపుణులు. మర్యాదపూర్వకంగా క్రికెట్‌ నుంచి తప్పుకుంటే.. ధోనికి తనకు లభించాల్సిన గౌరవం దక్కుతుందని మాజీ క్రికెటర్లు అంటున్నారు. మరీ మిస్టర్‌ కూల్‌ మనస్సులో ఏముందో కాలమే సమాధానం చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: