తెలుగుదేశం పార్టీకి ఎన్నో శాపాలు తగిలాయి కాబట్టే 2019 ఎన్నికల్లో అధికారంలోకి రాకుండా పోయింది. ఇక మరో నాలుగేళ్లలో జరిగే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో కూడా తమ్ముళ్లకు తెలియదు కానీ మిగిలిన వారు ఎవరికి తోచిన జాతకం వారు చెబుతున్నారు. టీడీపీకి భవిష్యత్తు లేదని వైసీపీ నేతలు రోజూ అంటున్న మాటే.

 

అయితే జనసేన నాయకుడు, సినీ నటుడు నాగబాబు తనకున్న రాజకీయ అంచనాలు బయటపెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ మళ్ళీ అధికారంలోకి రాదూ,రాలేదూ అని ఆయన గట్టిగానే అనేశారు. టీడీపీకి 2024లో అసలు చాన్సే లేదని తేల్చేశారు. అప్పుడు జరిగే ఎన్నికల్లో వైసీపీ వస్తుందా, జనసేన, బీజేపీ కాంబో వస్తుందా అన్నది కాలమే నిర్ణయిస్తుందని నాగబాబు అన్నారు.

 

అయితే టీడీపీఎ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాలేదు అని కచ్చితంగా చెప్పేస్తున్నారు అసలు టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చి ఏం ఒరగబెట్టిందని మళ్ళీ ఆ పార్టీని జనాలు గెలిపించడానికి అని నాగబాబు లాజిక్ పాయింట్ లాగారు. టీడీపీ తప్ప మిగిలిన మూడు పార్టీలు మాత్రమే 2024 నాటికి ఎన్నికల రేసులో ఉంటాయని, అధికారం విషయంలో ఆశలు, ఆకక్షలు ఆ పార్టీలకే ఉందని కూడా నాగబాబు అన్నారు.

 

ఇదిలా ఉండగా నాగబాబు ఈ మధ్యనే అమరావతి భూముల గురించి కూడా ఘాటుగానే మాట్లాడారు. అక్కడ ఇన్సైడెర్ ట్రేడింగ్ జరిగింది అని కూడా ఆయన అన్నారు. అక్కడ పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కూడా టీడీపీ నేతల చలువతో చాలా మంది చేశారన్నది నాగబాబు ఆరోపణ.

 

మొత్తానికి నాగబాబు గత మూడు రోజుల వ్యవధిలో టీడీపీని ఇలా టార్గెట్ చేయడం ఇది రెండవసారి. మరి ఈ  యుధ్ధం ఆయన మరెన్ని రోజులు  కొనసాగిస్తారో చూడాలి. పసుపు పార్టీకి  ఈ పరిణామాలు ఇక్కట్లు పెట్టేలా ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: