కేశినేని నాని....తెలుగుదేశం పార్టీలో కీలక నేత. విజయవాడ ఎంపీగా రెండోసారి గెలిచిన నాయకుడు. రాష్ట్రమంతా జగన్ గాలి ఉన్నా సరే 2019 ఎన్నికల్లో కేశినేని ఎంపీగా గెలిచి సత్తా చాటారు. అయితే ఆ ఎన్నికల్లో కేశినేని విజయం వెనుక ఆయన కుమార్తె కేశినేని శ్వేత కృషి కూడా చాలానే ఉంది. అమెరికా నుంచి వచ్చిన శ్వేత తండ్రి గెలుపు కోసం కష్టపడి ప్రచారం చేసింది.

 

కాకపోతే ప్రచార సమయంలోనే శ్వేత యాక్టివ్ రాజకీయాల్లోకి వస్తారని టీడీపీ శ్రేణులు అనుకున్నాయి. ఇక అందుకు తగ్గట్టుగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో శ్వేత ఎంట్రీ ఇచ్చేశారు. జగన్‌ ప్రభుత్వాన్ని ఢీ కొట్టి విజయవాడ కార్పొరేషన్‌ని టీడీపీ ఖాతాలో వేసేందుకు, అలాగే కుమార్తెకు రాజకీయ భవిష్యత్ ఇచ్చేందుకు కేశినేని స్కెచ్ వేసి, కుమార్తెని కౌన్సిలర్‌గా బరిలో దింపి మేయర్ అభ్యర్ధిగా నిలిపారు.

 

అయితే విజయవాడలో టీడీపీ గెలుపుకు అనుకూల పవనాలే ఉన్నాయి. పైగా కేశినేనికి నగరంపై పట్టు ఉంది.  దీంతో కుమార్తె విజయం తథ్యమే అని కేశినేని ఫిక్స్ అయిపోయి ఉన్నారు. కాకపోతే కరోనాతో ఎన్నికలు వాయిదా పడటంతో, కుమార్తె దూకుడు పెంచారు. ఓ వైపు విజయవాడ పరిధిలో ప్రజలకు సేవ చేస్తూనే, మరోవైపు టీడీపీ తరుపున నేషనల్ మీడియా డిబేట్లలో పాల్గొంటున్నారు. ఏ విషయాన్నైనా స్పష్టంగా చెబుతూ...జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనని నేషనల్ మీడియాలో గట్టిగానే ప్రశ్నిస్తున్నారు.

 

ఇటు తెలుగు మీడియా డిబేట్లలో కూడా యాక్టివ్ గానే పాల్గొంటూ ఆకట్టుకుంటున్నారు. అయితే దీని బట్టి చూస్తే శ్వేత రాజకీయాల్లో పూర్తి యాక్టివ్ అయినట్లే అని తెలుస్తోంది. అలాగే ఆమె టార్గెట్ మేయర్ కాదని అర్ధమవుతుంది. ఒకవేళ కేశినేని నాని రాజకీయాల్లో నుంచి తప్పుకుంటే ఎంపీగా  వెళ్ళే అవకాశముంది. లేదంటే భవిష్యత్‌లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లేకపోలేదు. విజయవాడ వెస్ట్‌లో ఎలాగో జలీల్ ఖాన్ యాక్టివ్ గా లేరు. ఆయన కుమార్తె షబానా అమెరికా వెళ్ళిపోయారు. దీంతో ఆ స్థానంలో శ్వేత పోటీ చేసే ఛాన్స్ కూడా ఉందని తమ్ముళ్ళు చెబుతున్నారు. మరి చూడాలి శ్వేత రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: