జగన్ సీఎం పీఠం ఎక్కి ఏడాది పూర్తి అయిన సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు మంచి ఉత్సాహంతో ఉన్నారు. ఏడాది సంబరాలు ఘనంగా జరుపుకుంటూనే, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఓ రేంజ్‌లో విమర్శలు చేస్తున్నారు. టీడీపీ నేతలు చేసే విమర్శలకు కౌంటర్లు ఇస్తూనే, జగన్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

 

ఏడాది పాలనలో చంద్రబాబుకి ట్రైలర్ కనిపించిందని, నాలుగేళ్లలో క్లైమాక్స్ కనిపిస్తుందని అన్నారు. సీఎంగా ఉన్నప్పుడే చంద్రబాబు తన తనయుడు లోకేష్‌ని మంగళగిరిలో గెలిపించుకోలేక పోయారని, లోకేష్‌ని అసెంబ్లీకి పంపాలంటే జగన్ కాళ్లు పట్టుకుని వైసీపీ టిక్కెట్ అడగాల్సిన పరిస్థితి ఉందని సెటైర్ వేశారు. ఇక గతంలో మంత్రి పదవులు ఆశ చూపి వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్నారని, ఇప్పుడు వైసీపీ గుమ్మం దగ్గర టీడీపీ ఎమ్మెల్యేలు.. వైసీపీ సభ్యత్వం కోసం ఎదురు చూస్తున్నారని కౌంటర్ వేశారు.

 

అయితే ఆమంచి మంచి ఉత్సాహంతో మాట్లాడారని, కానీ చంద్రబాబుపై విమర్శలు చేసే అర్హత ఆమంచికి లేదని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. అసలు లోకేష్ సంగతి చంద్రబాబు చూసుకుంటారని, చంద్రబాబు ఏ పొజిషన్‌లో ఉన్నా లోకేష్ మాత్రం టీడీపీ కార్యకర్తగా కష్టపడుతున్నారని, ఆయనకు టిక్కెట్ సంగతి కంటే ముందు మీకు వైసీపీలో టిక్కెట్ వస్తుందో లేదో చూసుకోవాలని అంటున్నారు.

 

ఇక గతంలో బాబు వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తానని ఆశ చూపి మోసం చేశారని మాట్లాడుతున్నారు..అప్పుడు ఆమంచి ఉన్నది టీడీపీలోనే కదా. ఇండిపెండెంట్‌గా గెలిచి ఆమంచి టీడీపీ అధికారంలో ఉందనే కదా చంద్రబాబు పక్కకు వెళ్ళారని, అప్పుడే వైసీపీ ఎమ్మెల్యేలని చేర్చుకునేప్పుడు మోసం చేస్తున్నారని చెప్పాల్సింది కదా అని నిలదీస్తున్నారు. మీరే అధికార దాహంతో వచ్చారని, తర్వాత అధికారం పోతుందని మళ్ళీ వైసీపీలోకి వెళ్ళారని, ఇక మీలాంటి నాయకులు మాటలు పట్టించుకోవాల్సిన అవసరం ఏముందని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.    

మరింత సమాచారం తెలుసుకోండి: