ఓ వైపు క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న త‌రుణంలో వ‌చ్చిప‌డిన మ‌రో స‌మ‌స్య తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన సంగ‌తి తెలిసిందే. భార‌త‌దేశంలోని ప‌లు రాష్ట్రాల‌ను, ఆయా రాష్ట్రాల్లోని ప్ర‌జ‌ల‌ను తీవ్రంగా క‌ల‌వ‌రపాటుకు గురిచేస్తున్న మిడ‌త‌ల దండుకు తెలంగాణ‌కు సైతం అదే రీతిలో ఆందోళ‌న‌ను క‌లిగిస్తుంద‌నే అంచ‌నాలు వెలువ‌డ్డాయి. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల ద్వారా ఇప్పటికే తెలంగాణలోకి మిడతల దండు ప్రవేశించినట్లు  ప్రచారంలో జ‌రుగుతున్న త‌రుణంలో అలాంటిదేమీ లేద‌ని తేలింది.

 

తెలంగాణ‌కు స‌రిహ‌ద్దున ఉన్న మ‌హారాష్ట్ర, చ‌త్తీస్‌ఘ‌డ్ రాష్ట్రాల్లో మిడ‌తల దండు పెద్ద ఎత్తున్నే జ‌రిగిన నేప‌థ్యంలో తెలంగాణ  రాష్ట్రం వైపు మిడతల దండు వచ్చే అవ‌కాశం ఉంద‌ని తేలింది. కొత్తగూడెం, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, పెద్దపల్లి జిల్లాల్లో వీటి ప్ర‌భావం ఎక్కువ ఉంటుంద‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మైంది. ఇదే స‌మ‌యంలో వీటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. సరిహద్దుల్లోనే వాటిని సంహరించేలా పకడ్బందీ వ్యూహాలను సిద్ధంచేసింది. పొద్దంతా ప్రయాణించి, రాత్రివేళ విశ్రాంతి తీసుకునే సమయాల్లో వాటి పనిపట్టేందుకు రసాయనాల పిచికారీకి ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రంగంలోకి దిగిన అగ్నిమాపక శాఖ సరిహద్దు జిల్లాల్లో ఫైరింజన్లను మోహరించింది. 

 

ఇలా తెలంగాన స‌ర్కారు మిడ‌త‌లను ఎదుర్కునేందుకు క‌స‌ర‌త్తు చేసిన త‌రుణంలో గాలివాటం ఆధారంగా మిడతల దండు దిశ మార్చుకొని ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ వైపు వెళ్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. రాష్ర్టానికి 400 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో తిష్ఠవేసిన ఎడారి మిడతల దండు శుక్రవారం మధ్యాహ్నానికి మధ్యప్రదేశ్‌ వైపు దిశ మార్చుకున్నట్లు అధికారులు గుర్తించారు. రాబోయే రోజుల్లో అవి ఏ వైపు దిశను మార్చుకుంటాయనే విషయంపై మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల‌కు చెందిన శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నట్లు అగ్రికల్చర్‌ టెక్నాలజీ అప్లికేషన్‌ రీసె ర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (అట్రాయ్‌) తెలిపింది. మిడతలు ఉదయం 9 గంటల తర్వాత ఎగరడం ప్రారంభిస్తాయని, దాని ఆధారంగా అవి ఏ దిశవైపు పయనిస్తాయో తెలుసుకోవచ్చని అట్రాయ్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. రాబోయే రెండు, మూడు రోజుల వరకు దక్షిణాది రాష్ట్రాల‌కు ఈ మిడతల దండుతో ఎలాంటి సమస్య ఉండదని వారు స్పష్టం చేశారు. మొత్తంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి, తెలంగాణ రాష్ట్రానికి రూటు మార్చుకొని ఈ మిడ‌త‌ల దండు పెద్ద రిలీఫ్ ఇచ్చిందంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: