ప్రపంచంలోనే అత్యధిక సంపాదన గల అథ్లెట్‌గా స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ నిలిచాడు. ఫోర్బ్స్‌ లిస్ట్‌లో ఫస్ట్‌ ప్లేస్‌ను దక్కించుకున్నాడు స్విస్‌ మాస్టర్‌. టాప్‌-100 క్రీడాకారుల లిస్ట్‌లో ఫెడరర్‌ ఐదో ప్లేస్‌ నుంచి ఏకంగా టాప్‌ని కొల్లగొట్టాడు. ఈ లిస్ట్‌లో భారత్‌ నుంచి టీమిండియా క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్‌ కోహ్లీకి మాత్రమే చోటు లభించింది.

 

ఫోర్బ్స్ కింగ్‌గా రోజర్‌ ఫెడరర్‌ నిలిచాడు.  2019 జూన్‌ నుంచి 2020 జూన్‌ కాలానికి రోజర్‌ 106.3 మిలియన్‌ డాలర్లను సంపాదించాడు. భారత్‌ కరెన్సీలో ఇది దాదాపు 803 కోట్ల రూపాయలతో సమానం. ఇందులో 10 కోట్ల డాలర్లు ఎండార్స్‌మెంట్ల ద్వారా వచ్చాయి. మిగతా 63 లక్షల డాలర్లు టోర్నీలు ఆడటం ద్వారా గెల్చుకున్న ప్రైజ్‌మనీ. ఫోర్బ్స్‌ లిస్ట్‌లో ఒక టెన్నిస్‌ ప్లేయర్‌ అగ్రస్థానంలో నిలువడం ఇదే తొలిసారి.

 

కరోనా ఎఫెక్ట్‌తో వేతనాల్లో కోత పడటంలో సాకర్‌ స్టార్లు క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్‌ మెస్సీ వరుసగా రెండు, మూడు స్థానాలకు పడిపోయారు. క్రిస్టియానో రొనాల్డో 105 మిలియన్‌ డాలర్లు సంపాదించగా.. మెస్సీ 104 మిలియన్‌ డాలర్లు ఆర్జించాడు. ఫోర్బ్స్‌ లిస్ట్‌లో 35 మంది బాస్కెట్‌ బాల్‌ ప్లేయర్లే ఉన్నారు. టాప్‌-100 క్రీడాకారుల జాబితాలో ఇద్దరు మహిళలకు మాత్రమే చోటు దక్కింది. ఆ ఇద్దరు కూడా టెన్నిస్‌ స్టార్లు నవోమి ఒసాక , అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్‌. ఒసాక  29వ స్థానంలో నిలవగా.. సెరెనా విలియమ్స్‌  33వ ప్లేస్‌ను దక్కించుకుంది. గత 12 నెలల కాలంలో ఆటగాళ్లు సంపాదించిన మొత్తాన్ని లెక్కించి ఈ లిస్ట్‌ను రూపొందించారు.

 

ఈ లిస్ట్‌లో భారత్‌ నుంచి విరాట్‌ కోహ్లీకి మాత్రమే చోటు లభించింది. ఫోర్బ్స్‌ జాబితాలో 196 కోట్ల రూపాయల ఆదాయంతో టీమిండియా కెప్టెన్‌ 66 వ స్థానంలో నిలిచాడు. గతేడాదితో పోలిస్తే.. విరాట్‌ 34 స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. టాప్‌-100లో నిలిచిన ఏకైక క్రికెటర్‌, భారత్‌ నుంచి ఏకైక క్రీడాకారుడు కోహ్లీనే కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: