కర్ణాటకలో సంకీర్ణాన్ని కూలదోసి గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వంలో ఏదో అలజడి రేగుతోంది. 20 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం కావడం ఎన్నో ఊహాగానాలకు తావిస్తోంది. ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని కూడా అధిష్ఠానికి సూచించారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. 

 

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పపై సొంత పార్టీలో అసంతృప్తి మొలకెత్తుతోంది. 20 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారు. మరికొందరు ఎమ్మెల్యేలు ఫోన్ లైన్లో టచ్ లోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. సీఎంగా యడియూరప్ప పనితీరుపై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్టు చెబుతున్నారు. కరోనా టైమ్ లో తమ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో కూడా సీఎం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేలు వాపోయినట్టు సమాచారం. వయోభారం యడియూరప్ప పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. యడియూరప్ప స్థానంలో మాజీ సీఎం జగదీష్ షెట్టార్ లేదా లింగాయత్ వర్గానికే చెందిన మూడు సార్లు ఎమ్మెల్యే బసన్నగౌడ పాటిల్ ను ఎంపిక చేయాలని కూడా హైకమాండ్ కు ప్రతిపాదనలు పంపినట్టు చెబుతున్నారు. 

 

బసన్నగౌడ పాటిల్ నాయకత్వాన్ని 40 మందికి పైగా ఎమ్మెల్యేలు బలపరుస్తున్నట్టు తెలుస్తోంది. బసన్నగౌడ పాటిల్ ఉత్తర కర్ణాటకలో బీజేపీకి కీలక నేత. ఇక్కడి లింగాయత్ ల ఓట్లు గుంగుత్తగా కమలం పార్టీకి పడటంతో.. కీలకంగా వ్యవహరిస్తున్నారు. సీఎం యడియూరప్ప కూడా లింగాయత్ వర్గానికే చెందిన వ్యక్తి కావడంతో.. బసన్నగౌడ పాటిల్ పేరుపై ఆ వర్గంలోనూ వ్యతిరేకత రాదనే భావన ఉంది. 

 

ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వానికి స్వల్ప మెజార్టీనే ఉంది. అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలున్నాయి. బీజేపీకి సొంతంగా 117 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ముగ్గురు ఇండిపెండెంట్లు మద్దతిస్తున్నారు. కాంగ్రెస్, జేడీతో కూడిన విపక్ష సంకీర్ణానికి 102 మంది సభ్యుల బలం ఉంది. అసెంబ్లీలో మరో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతానికి ఎమ్మెల్యేల చర్చలు నాయకత్వ మార్పిడికే పరిమితమైనా.. భవిష్యత్తులో ఎటు దారితీస్తాయోననే ఆందోళన బీజేపీ వర్గాల్లో ఉంది. అటు బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంపై కాంగ్రెస్ నేతలు తలో రకంగా స్పందించారు. అది వారి అంతర్గత వ్యవహారమని కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అంటే.. డీఫ్యాక్టో చీఫ్ మినిస్టరే అంతటికీ కారణమని మాజీ సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు. యడియూరప్ప హయాంలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతోందని ఆయన మండిపడ్డారు. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేల వ్యవహారం టీకప్పులో తుపానేనా.. లేకపోతే యడియూరప్ప పీఠానికే ఎసరు పెడుతుందా అనేది చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: