ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అంశం అంటోంది బీజేపీ. హోదాపై మేము పోరాటం చేసి కేంద్రంలోని మోడీని సైతం ఎదిరిసే జనం మాకు ఘోరమైన ఓటమి ఇచ్చారని టీడీపీ అంటోంది. ఇక హోదా విషయంలో ప్రజలకు ఆసక్తి లేదని, అందువల్ల పోరాడి సుఖమేంటి అని జనసేన అంటోంది. మొత్తానికి చూసుకుంటే హోదా ఇపుడు ఎవరికీ పట్టని అంశమైంది.

 

ఈ దశలో ఏడాది పాలన తరువాత మళ్లీ వైఎస్ జగనే హోదాను ముందుకు తెచ్చారు. ఓ మాటగా చెప్పుకోవాలంటే గుర్తుకు తెచ్చారని చెప్పాలి. హోదా కచ్చితంగా వస్తుంది. అయితే అది ఎపుడు అన్నది చూడాలి అని జగన్ అంటున్నారు. సరిగ్గా దీని మీద ఇపుడు టీడీపీ కస్సుమంటోంది. అన్ని హామీలు తీర్చానంటున్న జగన్ హోదా గురించి ఏం చెబుతారు. హోదాను ముందు సాధించండి అంటున్నారు టీడీపీ ఎంపీ కేశినేని నాని.

 

మీకు 22 మంది లోక్ సభ సభ్యులను ఇచ్చారు. ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మరి హోదాను ఎందుకు సాధించలేకపోతున్నారు అని సీపీఐ అడుగుతోంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ హోదా తేవాలంటే సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో ఉండాలని జగన్ ఎన్నికల ప్రచారంలో చెప్పలేదని అంటున్నారు హోదా కోసం జగనే ముందుండిపోరాడాలి అంటున్నారు.

 

ఇక జనసేన ఈ విషయం అసలు పట్టించుకున్నట్లుగా కనిపించడంలేదు. పవన్ కళ్యాణ్ మోడీ పాలన అద్భుతం అంటున్నారు. దేశవ్యాప్తంగా మోడీ బాగా పనిచేస్తున్నారని కితాబు ఇస్తున్నారు. కానీ ఏపీ విషయంలో మాత్రం ఆయన చెప్పడం లేదు, విభజన హామీలు కేంద్రం ఏపీ వరకూ  ఎంతవరకు నెరవేర్చింది అన్నది పవన్ ఆలోచించినట్లుగా కనిపించడంలేదు. పైగా గతంలో ఆయనే మోడీ సర్కార్ మీద గట్టిగానే మాటలతో దాడి చేశారు. పాచిపోయిన లడ్డూలు అని కూడా విమర్శించారు. ఇపుడు మోడీకి కితాబు ఇస్తున్న పవన్ కి ఆ లడ్లు గుర్తున్నాయా అని సెటైర్లు పడుతున్నాయి.

 

కాంగ్రెస్ సైతం ఇపుడు హోదా గురితించి పెద్దగా మాట్లాడడంలేదు. మళ్లీ ఈ నినాదం అటూ ఇటూ తిరిగి జగన్ వద్దకే వచ్చి చేరినట్లుగా కనిపిస్తోంది. జగన్ దీని మీద ఏమంటారో చూడాలి. ఎలా హోదా సాధిస్తారో చూడాలి. హోదా విషయాన్ని ప్రతిపక్షంలో ఉన్నపుడూ అధికారంలో ఉన్నపుడూ కూడా జనానికి గుర్తు చేస్తున్నది మాత్రం కచ్చితంగా జగనే అనడంతో సందేహం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: