వైఎస్ జగన్ సర్కారు స్పందన కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో ఎవరైనా సరే ఫిర్యాదు ఇస్తే.. తప్పకుండా దాన్ని అధికారులు పరిష్కరించాల్సిందే. ఈ కార్యక్రమం ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్పేందుకు ఓ చిన్న ఉదాహరణ ఇది. దీన్ని

సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ తన ఫేస్ బుక్ వాల్‌ పై పంచుకున్నారు.

 

60 ఏళ్ల మా ఇంట్లో పనిచేసిన బీబీ రెండో భార్యగా పడాల్సిన కష్టాలన్నీ పడింది. ఇంట్లో తిండిపెట్టకపోగా, పనిచేసుకుని బ్రతికే ఆమె తరచూ ముసలాడిచేతిలో చావు దెబ్బలు తింటూ తన రెండో ఆడపిల్లకు కూడా పెళ్లిచేసింది తినీ తినక కూడబెట్టుకున్న దాంతో. ముసలాడికి మొదటిభార్యకు ముగ్గురు కొడుకులు, ఇతడు ఇచ్చిన స్థలంలో ఇండ్లుకట్టుకుని కాపురాలు చేసుకునే వాళ్లవద్ద నివసిస్తూ అప్పుడప్పుడు ఈమెవద్దకు వచ్చి తన్ని పోతుంటాడు. బీబీకి ఒక గుడిసె వుంది. పరిస్తితిని అర్థంచేసుకున్న వీధిలోని కమ్యూనిస్టులు గుడిసె స్థలం ప్రభుత్వ పట్టాని బీబీపేరున మార్పించి రెండు దశాబ్దాల కిందటే అభ్యుదయం చూపారు. బదిలీమీద వూరువదలే ముందు ఆస్థలం ఆమె తదనంతరం ఇద్దరు కూతుర్లకు చెందేలా నేను రాయించి వారికి జతకలిశాను. అయితే ఈ విషయాలు తెలియని ఆమె భర్తా, అతని కోడుకులూ ఆమెని అందులోంచి వెళ్ళగొట్టి దాన్ని స్వాధీనం చేసుకోవాలనుకున్నారు.”

 

 

"అందుకనుగుణంగా,ఇద్దరు కూతుర్లకి పెళ్లిచేసి, ప్రస్తుతం పక్షవాతం కారణంగా పాచిపనులు కూడా చేసుకోలేక ఇబ్బందిపడే బీబీని గుడిసెలోంచి వెళ్లగొట్టి ఆక్రమించాలని ముసలాడిని పంపిస్తారు. "నాకు ఈ మొగుడొద్దు, రాత్రిపూట చంపేయడానికి ప్రయత్నిస్తున్నాడు, నన్ను బ్రతకనీయండ"నేది బీబీ వాదన. "మొగుడుని ఈ వయసులో భార్యకాపోతే ఎవరు చూస్తారు? భర్త అన్నాక తన్నకుండా వుంటాడా" అనే చుట్టుపక్కల సమాజపు ప్రవచనాలు, చివరికి పోలీసుస్టేషన్్‌లో ముసలాడు, కొడుకులూ, కోడల్లూగల బలవైపు పంచాయితీ అనుకూలమైపోవడం, వూర్లోనే వున్న ఇద్దరు కూతుర్లు ఏడుస్తూ మా ఇంటికిరావడం జరిగినప్పుడు రెండుసార్లు స్టేషన్‌కి కూడా వెళ్లాల్సి వచ్చింది స్వయంగా.”

 

 

"వూరువదలి వచ్చేటప్పుడు కొత్తముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన "స్పందన" అనే కార్యక్రమం కింద ఆమెకు క్లుప్తంగా లెటర్ రాసి కార్యక్రమంలో ఇవ్వమని వచ్చేశాం. అనుకున్నట్లే మరుసటిరోజే అంతవరకు నీతులు చెప్పి పంచాయితీ చెప్పిన పోలీసులు దగ్గరుండి మరీ ముసలాడిని సామానుతో సహా బయటికి వెళ్లగొట్టి మరోసారి ఇటువైపు రావద్దని, అతనికొడుకుల్ని హెచ్చరించి మరీ న్యాయం చేశారు.”

 

 

"నెలక్రితం బీబీ ఇంటికి ఫోన్ చేసి, సారు రాసిచ్చిన చీటీ వల్ల ఇప్పటిదాకా ముసలాడు, అతడి కొడుకు కోడళ్లు ఇంటివైపు రాలేదని చేసిన మేలు ఎప్పటికీ తల్చుకుంటానని చెప్పిందట. నిజానికి తల్చుకోవాల్సింది నన్ను కాదని స్పందన కార్యక్రమం అని నాకు తెలుసు.

 

 

అయితే పక్షం రోజులక్రితం మరల ముసలాడు వచ్చి గొడవచేశాడని పోలీసులు స్టేషన్‌కి రమ్మన్నారని ఫోన్ చేసి వాపోయింది. అక్కడ కరోనా డ్యూటీకోసం ఇంతకుముందున్న పోలీసులు లేరని ఏడ్చేసింది. ఏం ఫర్లేదు, ఈ కేసు "స్పందన"లో వుందని నీకు స్పందనలో రాసిచ్చిన రసీదు చూపించు, ఏమైనా అంటే నేను మాట్లాడతానన్నా. అమె చీటీ చూపించి విషయం చెప్పగానే ముసలాడిని, కొడుకుల్ని ఎస్సై తిట్టి వార్నింగ్ ఇచ్చి పంపేశారట, సంతోషపడుతూ ఫోన్ చేసింది. నువ్వు చచ్చేంత వరకూ నీ ఇంటికి ఎవరూ రారని, పోలీసులు ఏమీ అనరని, ఆ రసీదు నీదగ్గర పెట్టుకోమని చెప్పాను. చాలామంది బలహీనులకి ఈ కార్యక్రమం వూరట నిచ్చిందని విన్నాక ఇది చెప్పాలనిపించింది.”

 

-0-

మరింత సమాచారం తెలుసుకోండి: