ఏపీలో కరోనా విజృంభిస్తోంది. అది ఇప్పుడు ఏకంగా సీఎం క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించింది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం దగ్గర డ్యూటీలో ఉన్న ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఒకరికి కరోనా నిర్థరణ అయ్యింది. ఆయన కర్నూలు నుంచి నాలుగు రోజుల క్రితం డ్యూటీ కోసం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. తాజాగా ఆయనకు కరోనా పాజిటివ్‌ అని వైద్యులు తేల్చారు.

 

 

దీంతో ఆ కానిస్టేబుల్ ను ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత క్యాంపు కార్యాలయంలోని మిగిలిన సిబ్బందికి వైద్యపరీక్షలు చేశారు. ఏపీ ఎస్సీ కానిస్టేబుళ్లను విధుల నిర్వహణ నిమిత్తం అక్కడకూ ఇక్కడకూ మారుస్తుంటారు. అందులో భాగంగానే ఈ కానిస్టేబుల్ ను కర్నూలు నుంచి రప్పించారు. ఆయనతో పాటు మరికొందరు కర్నూలు నుంచి విధుల కోసం వచ్చారు. వీరికి మంగళగిరి సివిల్‌ పోలీసు క్వార్టర్స్‌లో అకామడేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ కానిస్టేబుల్ కు కరోనా ఉందని తేలడంతో మిలిగిన వారిని కూడా ఖాళీ చేయించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

 

 

సీఎం క్యాంపు కార్యాలయంలోనే కాదు.. ఏపీ సచివాలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఉద్యోగుల్లో సచివాలయంలో పని చేసే ఒకరికి కరోనా నిర్థరణ అయ్యింది. గుంటూరు కార్యాలయాల్లో పని చేసే ఇద్దరికీ కరోనా నిర్థరణ అయ్యింది. లాక్‌డౌన్‌తో హైదరాబాద్‌లో ఉండిపోయిన సెక్రటేరియట్, హెడ్డాఫ్ ది డిపార్ట్‌మెంట్‌ ఉద్యోుగులు ఇటీవల ప్రత్యేక బస్సుల్లో అమరావతికి వచ్చారు.

 

 

అక్కడ వారికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మొత్తం ముగ్గురికి కరోనా వచ్చినట్టు తేలింది. సెక్రటేరియట్ ఉద్యోగికి కరోనా వచ్చిందని తేలడంతో మిగిలిన ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగులందరికీ కరోనా నిర్ధరణ పరీక్షలు చేయాలని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కోరారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: