ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్థానంలో జస్టిస్ కనగరాజ్ ను నియమిస్తూ ఏపీ సర్కారు జారీ చేసిన ఆర్డినెన్సును ఏపై హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇది ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు చాలా ఊరట కలిగించే వార్త. అయితే ఈ తీర్పు వెలువడిన వెంటనే నిమ్మగడ్డ చూపించిన దూకుడు మాత్రం చాలా ఆశ్చర్యం కలిగించేలా ఉంది.

 

 

ఎందుకంటే.. అసలు హైకోర్టు తీర్పు గురించి బ్రేకింగ్ న్యూస్ వచ్చిన కొన్ని నిమిషాల్లోనే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ప్రెస్ నోట్ విడుదల చేశారు. హైకోర్టు ఉత్తర్వులతో తాను మళ్లీ బాధ్యతలు స్వీకరించానని.. ఇకపై కూడా పక్షపాతం లేకుండానే పని చేస్తానని.. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వీలును బట్టి నిర్ణయం తీసుకుంటానని ఆ ప్రెస్ నోట్ లో తెలిపారు. ప్రెస్ నోట్ అంత వేగంగా మీడియా వర్గాలను సైతం ఆశ్చర్యపరచింది.

 

 

అంతే కాదు.. ఎన్నికల కమిషన్‌కు హైకోర్టులో న్యాయవాది అంటే స్టాండింగ్‌ కౌన్సిల్‌గా ఉన్న వీవీ ప్రభాకరరావు... రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తరఫున కోర్టులో కౌంటర్లు దాఖలు చేశారు. అయితే శనివారం ఉదయం నిమ్మగడ్డ రమేష్‌ తన ఫోన్‌ నుంచి వీవీ ప్రభాకరరావుకు స్వయంగా ఫోన్‌ చేసి, స్టాండింగ్‌ కౌన్సిల్‌ పోస్టుకు రేపటిలోగా రాజీనామా చేయాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌లో కొత్త రక్తం నింపాలని భావిస్తున్నట్లు నిమ్మగడ్డ రమేష్‌ చెప్పారు. అంతే కాదు.. కొత్త స్టాండింగ్‌ కౌన్సిల్‌ను సోమవారం కల్లా నియమించనున్నట్లు నిమ్మగడ్డ చెప్పారట.

 

 

అయితే.. తనకు కొంత సమయం కావాలని ప్రభాకర్‌రావు కోరారట. కానీ నిమ్మగడ్డ మాత్రం గడువు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పారట. దీంతో సదరు ప్రభాకరరావు విషయాన్ని అడ్వకేట్ జనరల్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన అభిప్రాయం కోరారు. అయితే అసలు ఎన్నికల కమిషనర్‌గా స్వీయ పునరుద్ధరణే చెల్లనప్పుడు నిమ్మగడ్డ ఇచ్చే ఇలాంటి ఆదేశాలు చట్ట పరిధిలోకి రావని ఏజీ ఆయనకు సలహా ఇచ్చారట.

మరింత సమాచారం తెలుసుకోండి: