నిమ్మగడ్డ వర్సస్ జగన్.. ఏపీలో కొన్ని రోజుల క్రితం రోజూ పతాక శీర్షికలకు ఎక్కిన వ్యవహారం.. ఇప్పుడు మరోసారి అదే స్థాయిలో రెండు వ్యవస్థలకు ఘర్షణ ఏర్పడుతోంది. ప్రభుత్వానికి చెప్పా పెట్టకుండా ఉన్నపళంగా ఎన్నికలను వాయిదా వేయడంతో మొదలైన వీరి మధ్య ఘర్షణ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా వ్యవస్థల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

 

 

జగన్ కు చెప్పాపెట్టకుండా పంచాయతీ ఎన్నికలను నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తన విచక్షణ ఉపయోగించి వాయిదా వేస్తే.. ఆయన్ను పదవి నుంచి సాగనంపేందుకు జగన్ ఏకంగా ఆర్డినెన్సునే తీసుకొచ్చారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్నే కుదిస్తూ ఆర్డినెన్సు తెచ్చి.. పరోక్షంగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను పదవి నుంచి తొలగించేశారు. ఒక విధంగా ఎన్నికలను వాయిదా వేయడం నిమ్మగడ్డ తీసుకున్న సాహసోపేతమైన చర్య అయితే .. జగన్ ఆర్డినెన్సు తీసుకొచ్చి ఆయన ఉద్యోగం పీకేయడం మరింత దూకుడు చర్యగా చెప్పాలి.

 

 

ఈ వ్యవహారం చివరకు కోర్టులకెక్కింది. చివరకు హైకోర్టు నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు చెప్పింది. దీంతో ఇక ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిందని అంతా అనుకున్నారు. కానీ ఈ ఘర్షణను జగన్ సర్కారు కొనసాగించాలనే నిర్ణయించినట్టు కనిపిస్తోంది. హైకోర్టు తీర్పులోని కొన్ని టెక్నికల్ అంశాలను, న్యాయ అంశాలను పరిశీలించిన అడ్వకేట్ జనరల్.. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్వీయ పునరుద్ధరణ చెల్లదంటున్నారు. హైకోర్టు తీర్పుపై స్టే కోసం దరఖాస్తు చేసుకున్నారు. సుప్రీంకోర్టుకు సైతం వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

 

 

నిమ్మగడ్డ చర్యలకు హైకోర్టు తీర్పు మద్దతునిచ్చే విధంగా లేదంటున్నారు అడ్వకేట్ జనరల్. హైకోర్టు తీర్పు అధికారిక కాపీ మొత్తం చదివిన తర్వాత అందులో అనేక లోపాలున్నాయంటున్నారు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్‌. మొత్తం మీద ఎట్టిపరిస్థితుల్లోనూ నిమ్మగడ్డ ఎస్‌ఈసీగా కొనసాగించకుండా ఉండే అన్ని మార్గాలను జగన్ సర్కారు అన్వేషిస్తోందన్నమాట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: