ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్థానంలో జస్టిస్ కనగరాజ్ ను నియమిస్తూ ఏపీ సర్కారు జారీ చేసిన ఆర్డినెన్సును ఏపై హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇది ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు చాలా ఊరట కలిగించే వార్త. ఈ తీర్పుతో జగన్ సర్కారుపై నిమ్మగడ్డ పైచేయి సాధించారనే అంతా భావించారు. అయితే శనివారం సాయంత్రం ఉన్నట్టుండి అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ప్రెస్ మీట్ పెట్టి మరో బాంబు పేల్చేశారు.

 

 

హైకోర్టు తీర్పు వెలువడిన కొన్ని నిమిషాల్లోనే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ప్రెస్ నోట్ విడుదల చేశారు. హైకోర్టు ఉత్తర్వులతో తాను మళ్లీ బాధ్యతలు స్వీకరించానని.. ఇకపై కూడా పక్షపాతం లేకుండానే పని చేస్తానని.. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వీలును బట్టి నిర్ణయం తీసుకుంటానని ఆ ప్రెస్ నోట్ లో తెలిపారు. అంతే కాదు.. ఆ మరుసటి రోజే ఎన్నికల కమిషన్‌కు హైకోర్టులో న్యాయవాది అంటే స్టాండింగ్‌ కౌన్సిల్‌గా ఉన్న వీవీ ప్రభాకరరావుకు ఫోన్ చేసి రేపటిలోగా రాజీనామా చేయాలని ఆదేశించారు.

 

 

అయితే శనివారం సాయంత్రం అడ్వకేట్ జనరల్ శ్రీరామ్.. అసలు నిమ్మగడ్డ స్వీయ పునరుద్ధరణ కుదరదని తేల్చేశారు. కోర్టు ధిక్కార నిబంధనల ప్రకారం.. ఏదైనా తీర్పులో నిర్ధిష్ట కాల వ్యవధిని న్యాయస్థానం విధించకుంటే, ఆ తీర్పును అమలుచేసేందుకు ప్రభుత్వానికి రెండు నెలల గడువు ఉంటుంది. ఒకవేళ న్యాయస్థానం రమేష్‌ను ఎన్నికల కమిషనర్‌గా పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసి ఉంటే, అప్పుడు ప్రభుత్వం అందుకు అనుగుణమైన ఉత్తర్వులు జారీచేసి ఉండేది.

 

 

కానీ, ప్రభుత్వం ఇప్పటివరకు అలా ఉత్తర్వులేవీ ఇప్పటివరకు జారీచేయలేదు. ఈ నేపథ్యంలో.. నిమ్మగడ్డ రమేష్‌ చేసుకున్న స్వీయ పునరుద్ధరణ ఉత్తర్వులు హైకోర్టు తీర్పునకు అనుగుణంగా లేవు. ఇలాంటి ప్రొసీడింగ్స్‌ ఇచ్చే అధికారం ఆయనకు లేదని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: