ప్ర‌స్తుతం మాన‌వ సంబంధాల విష‌యంలో ఆచితూచి అత్యంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాల్సిన ప‌రిస్థితి ఎదురువుతోంది. ఏం చేస్తే..ఏం జ‌రుగుతుందో అనే టెన్ష‌న్ ప‌లువురిని ప‌ట్టి పీడిస్తోంది. ఉమ్మ‌డి కుటుంబం అన్న త‌ర్వాత అత్తా కోడ‌ల్లు క‌లిసి ఉండ‌టం, ఇంట్లో ప‌నులు చేసుకోవ‌డం స‌హ‌జంగా కానీ ఓ కోడ‌లు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఇంటి పనులు చేయమని త‌న‌ను అత్త పురమాయిస్తోంద‌ని, దీన్ని అడ్డుకోవాల‌ని కోరుతూ, కేరళ హైకోర్టు మెట్లు ఎక్కింది. అయితే, కోర్టు ఆమెకు షాకిచ్చింది. అదే స‌మ‌యంలో భ‌ర్త‌కు తీపి క‌బురు చెప్పింది.

 


దేశంలోనే అత్య‌ధిక అక్ష‌రాస్యులు ఉన్న కేరళలో ఈ చిత్ర‌మైన ఘ‌ట‌న జ‌రిగింది. 17 ఏళ్ల క్రితం  ఈ ఇద్ద‌రికి వివాహం జ‌రిగింది. కొన్నాళ్లు సజావుగా సాగిన వీరి కాపురంలో అత్తా-కోడళ్ల మధ్య విభేదాలతో లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయి. భ‌ర్త తల్లి నుంచి విడివడి వేరు కాపురం పెడదామంటూ భార్య కోరింది.  దానికి ఆ భ‌ర్త నో చెప్పాడు. దీంతో భర్త  త‌న మాట విన‌డం లేద‌ని 2011లో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. దాంతో సదరు భర్త ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి విడాకులు ఇప్పించాలని కోరాడు. కోర్టులో వాద‌న‌ల సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు వెలుగులోకి వ‌చ్చాయి. 

 


కోర్టుకు హాజరైన సదరు భార్యామ‌ణి ..అత్త కారణంగానే తమ కుటుంబంలో కలతలు వచ్చాయని, ఆపరేషన్‌ జరిగి కుట్లు కూడా విప్పకముందే ఇంటి పనులు చేయాలంటూ ఒత్తిడి తెచ్చేదని కోర్టు ఎదుట తన గోడు వెళ్లబోసుకుంది. తనకు భర్త నుంచి విడాకులు తీసుకొనే ఉద్దేశం లేదని విన్నవించింది. దీంతో భర్త విడాకుల కేసును కొట్టివేస్తూ ఫ్యామిలీ కోర్టు తీర్పునిచ్చింది. అయితే, సదరు భర్త హైకోర్టును ఆశ్రయించాడు. వేరే కాపురం పెట్టాలని భార్య వేధింపుల కారణంగా తాగుబోతుగా మారానని, ఇకనైనా మనశ్శాంతిగా ఉండేందుకు ఆమె నుంచి విడాకులు ఇప్పించాలని కోరాడు. త‌న భార్య చేస్తున్న ఆరోపణలు ఎంత మాత్రమూ నమ్మదగినవి కావని తెలిపాడు. దీంతో అత్త కోడ‌లికి ప‌నులు చెప్ప‌డం చడం సర్వసాధారణంగా జరిగే విషయాలే అని కేరళ హైకోర్టు అభిప్రాయపడింది. అంతేకాకుండా భ‌ర్త విడాకుల పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: