కేంద్రం అంతా ఊహించినట్టుగానే లాక్ డౌన్ ను మరోసారి పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రెండు, మూడు వారాలు లాక్ డౌన్ ను పొడిగించిన కేంద్రం లాక్ డౌన్ ను ఈసారి నెల రోజులు పొడిగిస్తూ కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి జూన్ 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఐదో విడత లాక్ డౌన్ అమలు కానుంది. తాజా లాక్ డౌన్ లో కేంద్రం భారీ సడలింపులు ఇచ్చింది. అంతర్రాష్ట్ర ప్రయాణాలకు ప్రజలకు, సరుకుల రవాణాకు ఎలాంటి ప్రత్యేక పాస్‌లు అవసరం లేదని స్పష్టం చేసింది. 
 
అయితే అనుమతులు ఇచ్చినట్టే ఇచ్చి కేంద్రం మెలిక పెట్టింది. అవసరమైతే రాష్ట్రాలు అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి ఆంక్షలు విధించవచ్చని తెలిపింది. అయితే ప్రజలకు మాత్రం ముందుగానే అందుకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని పేర్కొంది. కేంద్రం విధించిన ఈ నిబంధనతో ఏ రాష్ట్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. రాష్ట్రాలు అనుమతులు ఇవ్వకపోతే ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారికి ఇబ్బందే అని చెప్పవచ్చు. 
 
మరోవైపు కేంద్రం విధించిన లాక్ డౌన్ మూడు దశల్లో ముగియనుంది. తొలి దశలో భాగంగా కేంద్రం జూన్ 8వ తేదీ నుంచి ప్రార్ధనా మందిరాలు, హోటల్స్, రెస్టారెంట్లు, ఆతిధ్య రంగ సేవలు, షాపింగ్ మాల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండో దశలో పరిస్థితులను పరిశీలించి విద్యాసంస్థలను తెరిచే అంశంపై కేంద్రం కీలక ప్రకటనలు చేయనుంది. రాష్ట్రాలతో చర్చించి వీటి విషయంలో పరిస్థితులకు అనుగుణంగా కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. 
 
మెట్రో సర్వీసులు, థియేటర్లు, పబ్‌లు, అంతర్జాతీయ విమానాలు, స్విమ్మింగ్ పూల్స్,పార్క్‌లు, జిమ్‌ల రీ-ఓపెన్‌పై మూడో దశలో కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. కేంద్రం ప్రతి ఒక్కరూ మాస్క్ ను తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, ఆరోగ్య సేతు యాప్ ను వినియోగించాలని సూచనలు చేసింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని కేంద్రం పేర్కొంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: