చైనాపై అమెరికా కన్నెర్ర చేసింది. హాంకాంగ్ ను డ్రాగన్ తన గుప్పిట్లోకి తీసుకుందని ట్రంప్ మండిపడ్డారు. చైనా ప్రభావానికి నిరసనగా ప్రపంచ ఆరోగ్య సంస్థతో కూడా సంబంధాలు తెంచుకుంటున్నామని ప్రకటించారు. నిబంధనలు పాటించని చైనా కంపెనీలపై చర్యలు తప్పవని హెచ్చరించారు ట్రంప్. 

 

ప్రపంచ ఆరోగ్య సంస్థతో తాము పూర్తిగా తెగదెంపులు చేసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. కరోనా విషయంలో ఆ  సంస్థతో పాటు చైనా కూడా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించి, ప్రపంచ వ్యాప్తంగా అపార ప్రాణ, ఆర్థిక నష్టాలకు కారణమయ్యాయని ఆరోపించారు. వైరస్ విషయంలో కీలక  అంశాలను దాచిపెట్టినందుకు చైనాపై ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. డబ్ల్యూహెచ్‌వోకు ఇచ్చే నిధులను ఇతర ప్రపంచ ప్రజారోగ్య సంస్థలకు మళ్లిస్తామని ట్రంప్‌ చెప్పారు. 

 

అమెరికా స్టాక్‌ ఎక్స్ ఛేంజీలో నమోదై, తమ దేశ చట్టాలను గౌరవించని చైనా కంపెనీలపైనా చర్యలు తీసుకుంటామని ట్రంప్‌ వెల్లడించారు. అమెరికా భద్రతకు ముప్పుగా పరిణమించే చైనా పౌరులను ఇకపై దేశంలోకి అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. అలాగే అమెరికాలో చైనా పెట్టుబడుల  విషయంలోనూ నిబంధనల్ని కఠినతరం చేస్తామని ప్రకటించారు. 

 

హాంకాంగ్‌ స్వేచ్ఛకు తూట్లు పొడిచేలా తీసుకొచ్చిన జాతీయ భద్రతా బిల్లును చైనా నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ ఆమోదించడంపైనా ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. హాంకాంగ్‌కు ఇచ్చిన ప్రత్యేక హోదాకు స్వస్తి పలకనున్నామని  తెలిపారు. 1984లో బ్రిటన్‌తో కుదిరిన ఒప్పందానికి చైనా తూట్లు పొడుస్తోందని చెప్పారు. గత కొన్నేళ్లుగా అమెరికాను చైనా కొల్లగొడుతోందని ట్రంప్‌ ఆరోపించారు. ఉద్యోగాల్లో సైతం అమెరికా నిబంధనల్ని అతిక్రమించిందని ఆరోపించారు. చైనాతో అమెరికా ఎప్పటికీ నిర్మాణాత్మక బంధాన్నే కోరుకుంటోందని.. కానీ, అందుకోసం దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడలేమని ట్రంప్‌  వ్యాఖ్యానించారు. 

 

హాంకాంగ్‌పై చైనా ఆధిపత్య ధోరణిని నిరసిస్తూ.. అగ్రరాజ్యం హాంకాంగ్‌కు కల్పించిన ప్రత్యేక వెసులుబాట్లను రద్దు చేయాలని ట్రంప్ అధికారుల్ని ఆదేశించారు. చైనా మిలిటరీతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న విద్యార్థులపై నిషేధం  విధించేందుకు ఆదేశాలు జారీ చేశారు. అమెరికా చర్యలు శక్తిమంతంగా, పారదర్శకంగా ఉంటాయని స్పష్టం చేశారు ట్రంప్. 

మరింత సమాచారం తెలుసుకోండి: