భారతదేశంలో కరోనా వాయువేగంతో విస్తరిస్తోంది. పరిస్థితి చూస్తుంటే.. మనం ప్రపంచంలో టాప్ ఫైవ్ దేశాల జాబితాలో చేరడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. వచ్చే నెల కూడా కేసుల ఉధృతి ఇలాగే ఉంటే.. అమెరికా తర్వాత రెండో స్థానంలో మనమే ఉంటామనే ఆందోళన వ్యక్తమౌతోంది. 

 

దేశంలో కరోనా ఉద్ధృతికి తెరపడట్లేదు. రోజువారీ కేసుల విషయంలో వెయ్యి, ఐదు వేలు దశ దాటి.. రెండు రోజుల క్రితం ఏడు వేల స్థాయికి చేరింది భారత్. గత 24 గంటల్లో కేసులు 8 వేలకు చేరువయ్యాయి. ఇదే స్పీడ్ కొనసాగితే.. వచ్చే నెలాఖరుకు అమెరికా తర్వాత అత్యధిక కరోనా కేసులతో మనమే రెండో స్థానంలో ఉంటామని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం భారత్ యాక్టివ్ కేసుల్లో ఐదో స్థానంలోనూ, కొత్త కేసుల్లో మూడో స్థానంలోనూ, మొత్తం కేసుల పరంగా తొమ్మిదో స్థానంలోనూ కొనసాగుతోంది. 

 

రెండు రోజుల క్రితమే కరోనా మరణాల్లో చైనాను దాటేసిన ఇండియా.. 24 గంటల క్రితమే మొత్తం కరోనా కేసుల విషయంలో టర్కీను వెనక్కి నెట్టి తొమ్మిదో స్థానానికి ఎగబాకింది. రోజుకు 8 వేల చొప్పున కేసులు నమోదైతే.. 2,3 రోజుల్లోనే ఇటలీ తర్వాత ఏడో స్థానానికి చేరుతుందనే అంచనాలున్నాయి. అయితే కేసుల సంఖ్య ఇలాగే కంటిన్యూ అవుతుందా.. ఇంకా పెరుగుతుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. లాక్ డౌన్ సడలింపులు పెరుగుతున్న తరుణంలో.. వైరస్ వ్యాప్తి ఇంకా ఎక్కువగా ఉండే ప్రమాదం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. 

 

మొదటి రెండు విడతల లాక్ డౌన్ లో కరోనా కేసులు నియంత్రణలోనే ఉన్నా.. మూడో దశలో సడలింపులు ఇవ్వడంతో వైరస్ వేగం పుంజుకుంది. నాలుగోదశలో మరిన్ని సడలింపులు ఇవ్వడంతో.. కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ పోయింది. ఇప్పుడు ఐదో విడతలో హోటళ్లు, రెస్టారెంట్లకు కూడ పర్మిషన్ రావడంతో..  రోజువారీ కేసుల సంఖ్య 10 వేల వరకూ చేరొచ్చని అంచనా వేస్తున్నారు. 10 వేలకు చేరిన తర్వాత.. కరోనా కర్వ్ స్థిరంగా కొనసాగితే పర్లేదని, అప్పుడు కూడా ప్రోగ్రెస్సివ్ ట్రెండ్ కనిపిస్తే మరింత ముప్పు తప్పదనే ఆందోళన వ్యక్తమౌతోంది. జూన్ నెలాఖరు నాటికి కరోనా కర్వ్ పీక్ స్టేజ్ కు చేరుతుందని ఇప్పటికే అంచనాలున్నాయి. కేవలం కేసుల సంఖ్య మాత్రమే పెరిగి.. మరణాల సంఖ్య నియంత్రణలో ఉన్నా పరవాలేదని, కానీ మరణాల రేటు కూడా పెరిగితే మాత్రం మరింత నష్టం తప్పదని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: