తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు పెద్ద సంఖ్య‌లో నివ‌సిస్తున్న హైద‌రాబాద్‌లో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుండ‌టం అనేక‌మందిని క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తున్న సంగ‌తి తెలిసిందే. న‌గ‌రంలో వివిధ ర‌కాలైన ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాల కోసం ఉన్న వారిని క‌రోనా విస్తృతి క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది. అయితే, హైద‌రాబాద్‌లో ఎందుకు క‌రోనా విస్తృతి పెరిగిపోతోందో తేలింది. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించినప్పటి నుంచి రోడ్లు, మార్కెట్లలో రద్దీ ఎక్కువైంది. చాలామంది కనీస జాగ్రత్తలు కూడా పాటించడంలేదు. ఇటీవల కరోనా కేసులు పెరగడానికి ఇదే ప్రధాన కారణమని అధికార యం త్రాంగం నమ్ముతోంది.

 

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ,   కొవిడ్‌-19 సోకిన వ్యక్తి నుంచి వచ్చే తుంపర్లు ఇతరులపై పడడం వల్ల వైరస్‌ వ్యాప్తి చెంది కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నట్లు వెల్ల‌డించారు. . కొవిడ్‌-19 సోకిన వ్యక్తికి రోగ లక్షణాలు కనబడేందుకు 14 రోజుల సమయం పడుతున్నందున ఆ వ్యక్తికి వైరస్‌ సోకినట్లు తెలిసేలోగానే ఇతరులకు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు చెప్పారు. కొవిడ్‌ 19 నుంచి తమను, తమ కుటుంబాన్ని కాపాడుకునేందుకు జాగ్రత్తలు పాటించడమే సరైన మార్గమని కమిషనర్‌ వివరించారు. కాగా, త‌గు జాగ్రత్తలు పాటించడం ద్వారానే కరోనా వ్యాప్తిని అదుపు చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.


కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ, వైద్య-ఆరోగ్య శాఖ, పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తున్నాయి. అయితే ప్రజల భాగస్వామ్యం లేకుండా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం అంత సులభం కాదు. ఇందుకోసం ప‌లు జాగ్రత్తలు పాటించాల‌ని సూచిస్తున్నారు. 10 సంవత్సరాల లోపు పిల్లలు, 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు పూర్తిగా ఇళ్ల‌కే పరిమితమవ్వాలని కోరుతున్నారు. నిత్యావసర సరుకుల కొనుగోలు కోసం కుటుంబంలోని ఒక వ్యక్తి మాత్రమే తగు జాగ్రత్తలతో సమీపంలోని మార్కెట్‌కు వెళ్లాలని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. మాస్కులు ధరించకుండా బయటకు వెళ్లకూడదుని కోరుతున్నారు. నిత్యావసర సరుకుల కొనుగోలుకు వెళ్లినవారు మార్కెట్లు, షాపుల వద్ద కనీసం ఒక వ్యక్తికి, మరో వ్యక్తికి మధ్య ఆరు అడుగుల దూరం ఉండేలా చూడాలని కోరుతున్నారు. పని ప్రదేశంలో తరచుగా చేతులను శుభ్రం చేసుకునేందుకు నీటిని, సబ్బును, శానిటైజర్‌ను ఉంచుకోవాలని అందుబాటులో ఉంచాల‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. దగ్గు, జలుగు, గొంతు నొప్పి, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఒళ్లు నొప్పులు, తలనొప్పి తదితర లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని స్ప‌ష్టం చేస్తున్నారు. బీపి, షుగర్‌, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు వంటి తీవ్రమైన వ్యాధులకు చికిత్స పొందుతున్న వ్యక్తులు చాలా అప్రమత్తంగా ఉండాలని స్ప‌ష్టం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: