హైదరాబాద్ కరోనాబాద్ గా మారిపోతోంది. ఒక్కసారిగా పెరుగుతున్న కేసులు వణుకు పుట్టిస్తున్నాయి. రెండు వారాల వ్యవధిలో 500 కేసులు నమోదవడంతో.. డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్న కొద్దీ హైదరాబాద్ లో కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. 

 

విశ్వనగరం హైదరాబాద్‌పై మహమ్మారి కరోనా విశ్వరూపం చూపుతోంది. కేవలం 14 రోజుల్లోనే 500 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక కేసులు గ్రేటర్‌లోనే నమోదవుతున్నాయి. లాక్ డౌన్ సడలింపుల తర్వాత నమోదవుతున్న కేసుల్లో కూడా ఎక్కువశాతం జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉండటం ఆందోళనకు దారితీస్తోంది. జీహెచ్ఎంసీలో కూడా నాలుగు ప్రాంతాలకే కరోనా పరిమితమైందని ఓ దశలో అధికారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఒక్కసారిగా పెరుగుతున్న కేసులు.. హైదరాబాద్ నాలుగు వైపులా నమోదవుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే కాకుండా.. శివారు మున్సిపాలిటీలు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పెరుగుతున్న కేసులు అందరికీ దడ పుట్టిస్తున్నాయి. 

 

తెలంగాణ లో ఇప్పటి వరకు 2 వేల 498 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క మే నెలలోనే 1430 కేసులు రాగా.. అందులో జీహెచ్ఎంసీ పరిధిలోని కేసులే 948 ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 77 మంది చనిపోతే.. జీహెచ్ఎంసీలోనే 48 మంది మృతి చెందారు. అటు కేసులు.. ఇటు మరణాలు ఏ గణాంకాలు చూసినా.. జీహెచ్ఎంసీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. కరోనా వచ్చినప్పట్నుంచి హైదరాబాద్ డేంజర్ జోన్ లోనే ఉంది. ఆ తర్వాత కేసులు కాస్త అదుపులోకి వచ్చినట్టు కనిపించినా.. మళ్లీ విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. 

 

మే నెల ఒకటో తేదీ మాత్రమే జీహెచ్ఎంసీలో రోజువారీ కేసులు సింగిల్ డిజిట్ లోనే ఉన్నాయి. ఆ తర్వాత రోజు నుంచీ ఇప్పటివరకూ డబుల్ డిజిట్లోనే నమోదవుతున్నాయి. పైగా కేసుల సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో నమోదవుతున్న మొత్తం కరోనా కేసుల్లో 70 నుంచి 80 శాతం జీహెచ్ఎంసీ పరిధిలోనే వస్తున్నాయి. మరణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మే నెల ఒకటో తేదీన తెలంగాణలో ఆరు కేసులు వస్తే.. జీహెచ్ఎంసీలో ఐదు కేసులు నమోదయ్యాయి. మే ఆరో తేదీన వచ్చిన కేసులన్నీ జీహహెచ్ఎంసీ పరిధిలోవే. పదో తేదీన రాష్ట్రంలో 33 కేసులు రాగా.. హైదరాబాద్ లో 26 కేసులు వచ్చాయి. మే 20న రాష్ట్రంలో 27 కేసులు వస్తే.. జీహెచ్ఎంసీలో 15 కేసులు నమోదయ్యాయి. మే 30న రాష్ట్రంలో 74 కేసులు వస్తే.. హైదరాబాద్ లో 41 కేసులు వచ్చాయి. 

 

కొన్ని ప్రాంతాలకే పరిమితమైన కంటోన్మెంట్ జోన్ల సంఖ్య.. లాక్ డౌన్ సడలింపుల తర్వాత మరింత పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు.. సడలింపులు ఇచ్చినా.. జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే కరోనా భయం లేకుండా కొన్నిచోట్ల జరుగుతున్న ఫంక్షన్లు, పార్టీలు వైరస్ కు మంచి వేదికలుగా మారుతున్నాయి. పహాడీషరీఫ్ లో ఫంక్షన్ కు వెళ్లిన 20 మందికి పైగా కరోనా సోకడమే దీనికి ఉదాహరణ. ఇలాంటి ఘటనలు జరుగుతున్నంతవరకూ.. వైరస్ నియంత్రణలోకి రాదని నిపుణులు అంటున్నారు. హైదరాబాదీలు కూడా లాక్ డౌన్ మొదట్లో కరోనాను సీరియస్ గా తీసుకున్నా.. అసలిప్పుడు వైరస్ అనేది ఒకటి ఉందనే సంగతి మర్చిపోయారనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: