దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. కరోనా మరణాల సంఖ్య ఐదు వేలు దాటింది. రోజువారీ కేసుల్లో కూడా కొత్త రికార్డు నమోదైంది. ప్రపంచ వ్యాప్తంగా కోరనా కేసుల్లో 9వ స్థానంలో ఉన్న భారత్.. మరణాల్లో 13వ స్థానంలో కొనసాగుతోంది. మహారాష్ట్ర, తమిళనాడులో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. 

 

 కరోనా వైరస్‌ తో భారత్‌ విలవిల్లాడుతోంది. ఒక్కరోజే అత్యధికంగా రికార్డుస్థాయిలో 8 వేల 380 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒకేరోజు 8 వేలకుపైగా కేసులు బయటపడటం ఇదే మొదటిసారి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య  లక్ష 82 వేల 143కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. దేశంలో కరోనా మరణాల సంఖ్య 5 వేల 164కి చేరింది. వైరస్‌ సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 86 వేల 984 మంది కోలుకొని డిశ్చార్జి కాగా మరో 89 వేల 995మంది చికిత్స పొందుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రపంచంలోనే వైరస్‌ తీవ్రత అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్‌ 9వ స్థానంలో కొనసాగుతుండగా మరణాల్లో మాత్రం 13వ స్థానంలో ఉంది. 

 

కరోనా మహారాష్ట్రలో ఉగ్రరూపం దాలుస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయి కూడా అల్లాడిపోతోంది. భారత్‌లో సంభవించిన కొవిడ్‌ మరణాల్లో దాదాపు 40శాతం మహారాష్ట్రలోనే చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 2 వేల 940పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 65 వేల 168కి చేరింది. ఒక్కరోజే 99 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు వైరస్‌ సోకి మరణించిన వారి సంఖ్య 2 వేల 197కి చేరింది.ముఖ్యంగా  పోలీసులు వేల సంఖ్యలో వైరస్‌ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఒక్కరోజే మహారాష్ట్రలో 91మంది పోలీసులు ఈ వైరస్‌ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ బారినపడిన పోలీసు సిబ్బంది సంఖ్య 2 వేల 416కి చేరిందని ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో ఇప్పటివరకు 26మంది మృత్యువాత పడ్డారని తెలిపింది. కరోనా సోకిన పోలీసుల్లో ఇప్పటివరకు 969మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం మరో 1421మంది చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా విధులు నిర్వహిస్తున్న 45మంది ఆరోగ్య కార్యకర్తలపై దాడులు జరిగినట్లు మహారాష్ట్ర పోలీసులు వెల్లడించారు.

 

మహారాష్ట్ర తర్వాత కరోనా వైరస్‌ తీవ్రత అధికంగా తమిళనాడులో కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 938 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 21 వేల 184కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 160మంది మృత్యువాతపడ్డారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న తరుణంలో.. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను జూన్‌ 30వరకు కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అప్పటివరకు షాపింగ్ మాల్స్‌, దేవాలయాలు, సినిమా హాళ్లు మూసివుంటాయని స్పష్టం చేసింది. కరోనా తీవ్రత పెరుగుతున్న మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు 343 మంది  కన్నుమూశారు. ఇక పశ్చిమ బెంగాల్‌లో 309, ఉత్తర్‌ప్రదేశ్‌లో 201, రాజస్థాన్‌లో 193మంది మృత్యువాత పడ్డారు. గుజరాత్ లో కూడా మరణాల సంఖ్య వెయ్యి దాటింది. 

 

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ విశ్వరూపం చూపిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 1163 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 18 వేల 549కి చేరగా వీరిలో ఇప్పటివరకు 416మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఎయిమ్స్‌ ఆసుపత్రిలో దాదాపు 200 మందికి పైగా  ఆసుపత్రి సిబ్బంది ఈ వైరస్‌ బారినపడ్డారు. ఢిల్లీ పోలీస్‌ క్రైం బ్రాంచ్‌లో పనిచేస్తున్న అధికారి కరోనాతో చనిపోయారు. 

 

ఒడిశాలో రికార్డు స్థాయిలో ఒకేరోజు 129 కరోనా కేసులు వచ్చాయి. జమ్ముకశ్మీర్లో ఐఏఎస్ అధికారికి కరోనా రావడంతో.. ఆయన ఆఫీస్ లో పనిచేసే 12 మంది అధికారులు క్వారంటైన్ కి వెళ్లారు. కరోనాతో పోరాటం ముగియలేదని, ఇంకా జాగ్రత్తగా పోరాడాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ మన్ కీ బాత్ లో దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: