నందమూరి తారక రామారావు తనయుడు, ఆయన నట వారసుడు బాలక్రిష్ణ. ఎన్టీయార్ సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చినపుడు తనకు అసలైన రాజకీయ వారసుడు కూడా బలయ్యేనని 1987లో జరిగిన ఓ బహిరంగ సభలో బాహాటంగానే చెప్పారు. అది జరిగి 33 ఏళ్ళు అవుతోంది. బాలయ్య రెండు సార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 

 

మరి బాలయ్యకు ముఖ్యమంత్రి పదవి మీద ఆశ ఉందా. ఆయన ఆ పదవి కోసం ఎదురుచూస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ, హిందూపురంలో ఆయన మీద పోటీ చేసి ఓడిన ఇక్బాల్ ఎద్దేవా చేశారు. నిజానికి టీడీపీలో బాలయ్య మంత్రి పదవిని కూడా ఆశించలేదు. ఆయన 2014 ఎన్నికల్లో గెలిచినపుడు టీడీపీ అధికారంలోకి వచ్చినపుడు అంతా ఆయన సినిమా మంత్రి అవుతారనుకున్నారు. కానీ అలా జరగలేదు.

 

బాలయ్య వట్టి ఎమ్మెల్యేగా ఉండిపోతే ఆయన అల్లుడు లోకేష్ మాత్రం మంత్రి అయ్యారు. సరే ఇవన్నీ ఇలా ఉంటే బాలయ్యకు నిజంగా ఆ కోరిక ఉందా అంటే లేదు అని ఇప్పటికైతే చెప్పవచ్చు. కానీ బాలయ్య టాలీవుడ్లో ఓ మామూలు హీరో అని కొందరు అంటున్నారు. ఆయన మామూలు హీరో మాత్రమే కాదు, అటూ ఇటూ తరాలకు అసలైన వారధి,  ఒక నట దిగ్గజానికి వారసుడు.

 

ఒకనాడు ఎన్టీయార్ సినీ రంగాన్ని మోసి ఈ స్థాయికి తెచ్చారు. ఇక సినిమా రంగంలో బాలయ్య రూట్ సెపెరేట్. ఆయన తన సినిమాలు తాను అన్నట్లుగా ఉంటారు. ఆయనే తలచుకుంటే అటు సినీ పెద్దరికమైనా, ఇటు రాజకీయాల్లో పదవులు అయినా సులువుగానే వచ్చేవి.


 
ఇపుడున్న వారిలో చాలా మంది  బాలయ్య కంటే ఇండస్ట్రీలో జూనియర్లుగానే చెప్పాలి. బాలయ్య 14వ ఏటనే ముఖానికి రంగు వేసుకుని నటుడు అయ్యారు. అది లగాయితూ ఇంతదాకా నాలుగున్నర దశాబ్దాలుగా  ఆయన నటిస్తూనే ఉన్నారు. ఎక్కడా బ్రేక్ కూడా లేదు. ఇక రాజకీయాల్లో చూసుకుంటే ఆయన కంటే టీడీపీలో సీనియర్లు లేరు. బాలయ్యను ఏమీ కాదు అని అటు సినీ రంగంలోనూ, రాజకీయాల్లోనూ తీసిపారేస్తున్న వారికి బాలయ్య బలం తెలియదు.

 

ఆ మాటకు వస్తే నిజానికి బాలయ్యకే ఆయన బలం తెలియదు. ఆ ఆసక్తి లేనట్లుగా ఉంటారని అంటారు. ఆయన కనుక తలచుకుంటే ముందు వరసలోకి రావడమూ కష్టం కాదని అంటారు. ఇక రాజకీయాల్లో రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. వెటకారాలు, విమర్శలు ఆ రోజున నిజాలు అవుతాయేమోనని కూడా బాలయ్య అభిమానులు అంటున్నారు.  చూడాలి అందరూ అంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: