నల్గొండలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రాజకీయంగా ఉప్పు నిప్పులా ఉండే మంత్రి జగదీష్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకే వేదికపై వాదులాడుకున్నారు. ఇంచుమించు తోసుకున్నంత పని చేశారు. ఒక వాదనను మరొకరు కొట్టిపారేశారు. అధికార, ప్రతిపక్షనేతలు ఇలా ముఖాముఖి వాగ్వాదానికి దిగడం మామూలుగా అసెంబ్లీలోనే జరుగుతుంది. కానీ.. ఓ ప్రభుత్వ కార్యక్రమం ఈ ఆసక్తికరమైన అరుదైన సన్నివేశానికి వేదికగా నిలిచింది.

 

 

అసలేం జరిగిందంటే.. ఇటీవల తెలంగాణలో కేసీఆర్ సర్కారు నియంత్రిత సాగు విధానంవైపు మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో రైతులకు అవగాహన పెంచేందుకు సదస్సులు నిర్వహిస్తోంది. నల్గొండలో నిర్వహించిన ఇలాంటి ఓ సదస్సుకు మంత్రి జగదీష్ రెడ్డి హాజరయ్యారు. పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లా.. అందులోనూ నల్గొండ ఎంపీ కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కలుగుజేసుకుని మంత్రి అబద్దాలు చెబుతున్నారంటూ మండిపడ్డారు.

 

 

మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ రైతుల రుణమాఫీ చేశామని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ కోసం 17వేల కోట్లు వ్యయం చేసిందని మంత్రి చెప్పుకొచ్చారు. అయితే ఈ వాదనతో ఉత్తంకుమార్ రెడ్డి ఏకీభవించలేదు. దీనిపై ఇరువురు నేతల మద్య వాగ్యుద్ధం జరిగింది. ఒకరినొకరు తోసుకునే వరకూ పరిస్థితి వెళ్లింది.

 

 

రుణమాఫీ వివరాలకు సంబంధించి లెక్కలన్నీ అసెంబ్లీలో ప్రస్తావించామని.. ప్రతిపక్షపార్టీ నాయకులు వినకుండా పారిపోయారని మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. అంతే కాదు.. తాను మంత్రిగా ఇక్కడ ఉన్నానని.. తాను చెప్పింది వినాలని ఆయన అనడంతో గొడవ ఇంకాస్త పెద్దదైంది. ఆ తర్వాత పక్కన ఉన్న నాయకులు కాస్త సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: