నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం ఏపీ రాజకీయాలని బాగా హీటెక్కించిన విషయం తెలిసిందే. నిమ్మగడ్డని ఎలక్షన్ కమిషనర్‌గా తప్పిస్తూ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ని హైకోర్టు కొట్టేసి, మళ్ళీ రమేష్ కుమార్‌ని కమిషనర్‌గా నియమించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆదేశాలు అలా వచ్చాయో లేదో, అప్పుడే నిమ్మగడ్డ తాను కమిషనర్‌గా బాధ్యతలు తీసుకుంటున్నట్లు ప్రకటించుకున్నారు.

 

కానీ తీర్పు వచ్చిన వెంటనే రమేష్ కుమార్ ఎస్ఈసీగా కొనసాగవచ్చని హై కోర్టు చెప్పలేదని ఏజీ శ్రీరామ్ అన్నారు. హైదరాబాద్‌లోని క్యాంప్ ఆఫీసులో ఉంటూ... విజయవాడ ఆఫీసు నుంచి విడుదల చేసినట్లు సర్క్యులర్లలో పేర్కొన్నారన్నారు. తన నియామకం పునరుధ్ధరణకు సంబంధించి రమేష్ కుమార్ ఇచ్చిన సర్క్యులర్లు హై కోర్టు తీర్పునకు అనుగుణంగా లేవని శ్రీరామ్ వివరించారు.

 

ఇక దీనిపై కూడా రమేష్ కుమార్ రివర్స్ అయ్యారు. హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంపై.. తిరిగి హైకోర్టును ఆశ్రయించాలని నిమ్మగడ్డ నిర్ణయించుకున్నారు. కోర్టు ధిక్కారం కింద పిటిషన్‌ వేయాలనే యోచనలో ఉన్నారు. ఇదే సమయంలో మంత్రి బొత్స ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రమేష్ కుమార్‌కు టీడీపీ  కొమ్ముకాస్తోందని ఆరోపించారు. ఎస్ఈసీ వ్యవహారంలో ఏజీ వక్రబాష్యం చెబుతున్నారంటూ జరుగుతున్న వాదనలో వాస్తవం లేదని మాట్లాడారు.

 

అయితే బొత్స చెప్పిన మాటలు నిజమే,  రమేష్‌కు టీడీపీకి కొమ్ముకాస్తోందని అందులో ఎలాంటి అనుమానం లేదని రాజకీయ విశ్లేషుకులు అంటున్నారు. కాకపోతే రమేష్‌కు టీడీపీ సపోర్ట్ ఉందనే కదా...ఎలాగోలా ఆయన్ని పక్కకు తప్పించడానికే వైసీపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని కూడా చెబుతున్నారు. ఇది ఎలక్షన్ కమిషన్ వ్యవహారంలాగా కనిపించడం లేదని, రెండు పార్టీల మధ్య వార్‌లాగా ఉందని, అందుకే ఈ విషయంపై ఇంత రచ్చ జరుగుతుందని అంటున్నారు.

 

ఈ విషయంలో ప్రస్తుతానికి కాస్త టీడీపీదే పైచేయి కనిపిస్తోందని, కానీ అధికారంలో ఉంది వైసీపీ కాబట్టి ఏదైనా జరగొచ్చని మాట్లాడుతున్నారు. మరి చూడాలి చివరికి నిమ్మగడ్డ వ్యవహారంలో ఏ పార్టీది పైచేయి అవుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: