ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూ, జగన్ సర్కారుకూ జగడం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే మొన్న నిమ్మగడ్డకు అనుకూలంగా హైకోర్టు తీర్పు చెప్పింది. నిమ్మగడ్డ పదవీ కాలం తగ్గిస్తూ జగన్ సర్కారు తెచ్చిన ఆర్డినెన్సును హైకోర్టు కొట్టేసింది. ఆ ఆర్డినెన్సు ప్రకారం ఇచ్చిన జీవోలనూ కొట్టేసింది. దీంతో నిమ్మగడ్డ ఫుల్ ఖుషీ అయ్యారు. హైకోర్టు ఆర్డినెన్సును కొట్టేసిందన్న వార్త వచ్చిన నిమిషాల్లోనే నిమ్మగడ్డ ఓ ప్రకటన విడుదల చేశారు.

 

 

హైకోర్టు తీర్పు ప్రకారం తన పదవి పునరుద్ధరణ అయ్యిందని.. తాను బాధ్యతలు చేపట్టానని ఆయన ప్రకటించారు. ఆమేరకు ఎన్నికల కమిషన్ కార్యదర్శితో ఓ నోటిఫికేషన్ కూడా ఇప్పించుకున్నారు. అయితే హైకోర్టు తీర్పు పూర్తి పాఠం చదివిన అడ్వకేట్ జనరల్ .. అసలు నిమ్మగడ్డ తనంత తాను పదవి పునరుద్ధరణ చేసుకోలేరని.. ఆ అధికారం కోర్టు ప్రభుత్వానికే ఇచ్చిందని బాంబు పేల్చారు. హైకోర్టు తీర్పుపై స్టే కోరే హక్కు ప్రభుత్వానికి ఉందని వాదించారు.

 

 

ఈ అంశంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీరు సరిగ్గా లేదని.. ఆయన చేసింది ముమ్మాటికీ తప్పే అంటున్నారు ప్రముఖ విశ్లేషకుడు ప్రోఫెసర్ నాగేశ్వర్. హైకోర్టు ఆర్డినెన్సును కొట్టేసినప్పటికీ నిమ్మగడ్డను మళ్లీ నియమించాల్సిన పనిని ప్రభుత్వానికే అప్పగిస్తూ తీర్పు కాపీలో స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. అలాంటప్పుడు నిమ్మగడ్డ తనంతట తాను పదవీబాధ్యతలు స్వీకరించలేరని.. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ ఆయన బాధ్యతలు చేపట్టలేరని వివరించారు.

 

 

ఒకవేళ ప్రభుత్వం ఆయనకు బాధ్యతలు అప్పగించడంలో జాప్యం చేసినట్టయితే హైకోర్టు ఆదేశాలు ధిక్కరిస్తున్నారంటూ మరోసారి నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించవచ్చని నాగేశ్వర్ సూచించారు. అంతే తప్ప తనంతట బాధ్యతలు స్వీకరించానని నిమ్మగడ్డ ప్రకటించడం ముమ్మాటికీ తప్పేనని అభిప్రాయపడ్డారు ప్రోఫెసర్ నాగేశ్వర్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: