ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై కృష్ణా జిల్లా నందిగామ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయన లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఈ కేసును పోలీసులు నమోదు చేశారు. నందిగామ పోలీస్ స్టేషన్ లో ఒక లాయర్ చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు అయినట్టు తెలుస్తోంది. శ్రీనివాస్ అనే న్యాయవాది శ్రీనివాస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్‌ 188 కింద కేసు నమోదు చేశారు.

 

 

అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. ఏపీ అనే కాకుండా ఇప్పుడు దేశమంతటా లాక్ డౌన్ అమలులో ఉంది. ఈ సమయంలోర్యాలీలు, ప్రదర్శనలు వంటివి ముందస్తు అనుమతి లేకుండా నిర్వహించకూడదు. ఒక వేళ నిర్వహించినా లాక్ డౌన్ నిబంధనలు పాటించాలి. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలు తప్పకుండా పాటించాలి. అయితే.. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు భారీ కాన్వాయ్‌తో హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చారు.

 

 

ఇలా వచ్చే సమయంలో అనేక చోట్ల తెలుగుదేశం నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పలుచోట్ల గుంపులు గుంపులుగా గుమికూడి చంద్రబాబు కారును చుట్టుముట్టారు. చంద్రబాబు సైతం కారు నుంచి బయటకు వచ్చి చేతులు ఊపుతూ అభివాదం తెలిపారు. ప్రధానంగా జగ్గయ్యపేట, కంచికర్లలో చంద్రబాబు పర్యటన సందర్భంగా తెలుగు దేశం నాయకులు భారీగా జన సమీకరణ చేశారు.

 

 

ఈ ఘటన జరిగిన సమయంలోనే పలువురు వైసీపీ నాయకులు ఈ విషయంపై చంద్రబాబు తీరును తప్పుబట్టారు. చంద్రబాబు, లోకేశ్ లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోజే ఆరోపణలు గుప్పించారు. అయితే వారు కేసులు పెట్టే ప్రయత్నం చేయలేదు. అందువల్ల అవి ఆరోపణలుగానే మిగిలిపోయాయి. కానీ ఇప్పుడు ఓ లాయర్ కేసు పెట్టడంతో చంద్రబాబుపై లాక్ డౌన్ ఉల్లంఘన కేసు నమోదైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: