ఇండియా, చైనా మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొంది. సరిహద్దుల్లో పరిస్థితి గంభీరంగా ఉంది. యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి అని అంటే అది పెద్ద పదం అవుతుందేమో కానీ.. ప్రశాంతత మాత్రం చెదిరిపోయింది. ఈ నేపథ్యంలో భారత్ ను దెబ్బ తీసేందుకు చైనా దొడ్డి దారుల్లో ప్రయత్నాలు ప్రారంభించిందన్న కథనాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

 

 

భారత్ ను నేరుగా దెబ్బ తీయడం కంటే.. భారత్ ఇంటి సమస్యలను ఉపయోగించుకోవడం ద్వారా బలహీన పరచాలని చైనా కుట్ర పన్నుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మన దేశంలో మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఈశాన్య భారతం ప్రత్యేకత వేరు. విభిన్న భూభౌతిక వాతావరణ, సంస్కృతి, వేషభాషలు.. ఇలా ఎన్నో అంశాల్లో ఈశాన్య రాష్ట్రాలు తమ ప్రత్యేకత చాటుకుంటాయి. అదే సమయంలో తమ స్వయంప్రతిపత్తి కోసం ఈ రాష్ట్రాల ప్రజలు ప్రాణం పెడతారు.

 

 

దీని కారణంగానే ఈశాన్య రాష్ట్రాల్లో అనేక వేర్పాటు ఉద్యమాలు వచ్చాయి. అసోం, మణిపుర్‌, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో ప్రాంతీయ వేర్పాటు వాద సంస్థలు చాలా ప్రభావం చూపుతుంటాయి. అలాంటి సంస్థలకు ఆర్థికంగా, నైతికంగా మద్దతు ఇవ్వడం ద్వారా ఇండియాలో తీవ్రవాదాన్ని మళ్లీ రెచ్చగొట్టాలని చైనా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈశాన్య భారతంలో చైనా చొరవతో మరోసారి తీవ్రవాద ఉద్యమం శక్తిని పుంజుకునే అవకాశాలు పెరిగినట్టు తెలుస్తోంది.

 

 

ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదానికి, చైనాకు మధ్య దగ్గరి సంబంధం ఉన్న విషయం తెలిసిందే. 60 ఏళ్ల క్రితమే నాగా తిరుగుబాటుదారులకు చైనా సైన్యం శిక్షణ ఇచ్చినట్టు చరిత్ర చెబుతోంది. అసోంలో ఉల్ఫా, మణిపూర్ లో మెయిటీ తీవ్రవాదులకు కూడా చైనా అండదండలు అందించినట్టు చరిత్ర చెబుతోంది. ఇప్పుడు మరోసారి చైనా అదే కుట్ర చేస్తోందని తెలుస్తోంది. అందుకే భారత్ జాగ్రత్తపడాలని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: