క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న త‌రుణంలో...ఇంకో షాక్ తెర‌మీద‌కు వ‌చ్చింది. కరోనా మహమ్మారి ఇంకా తొలగిపోలేదు. వానకాలం మాత్రం తరుముకు వ‌స్తుంది. వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలతో పాటే సీజనల్‌ వ్యాధులూ పలుకరిస్తాయి. కరోనాకు సీజనల్‌ వ్యాధులు తోడైతే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. అందువల్ల ఇకనుంచి ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా బాధ్యతగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఒకే వ్యక్తికి సీజనల్‌ వ్యాధులతోపాటు కరోనా సోకే అవకాశం లేకపోలేద‌ని, కేసులు పెరుగుతుండటంతో వానకాలంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్ప‌ష్టం చేస్తున్నారు.

 

కరోనా కేసులు పెరుగుతున్న సమయంలోనే వర్షాలు మొదలవుతుండటంతో మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని   వైద్యులు స్ప‌ష్టం చేస్తున్నారు. కరోనా లక్షణాలు, సీజనల్‌ జ్వరాల లక్షణాలు దాదాపుగా ఒకేలా ఉంటాయి. దాంతో ఏది కరోనానో, ఏది సీజనల్‌ వ్యాధో గుర్తించడం వైద్యులకు సవాలుగా మారే అవకాశమున్నది. వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం, వైరల్‌ ఫీవర్స్‌తో పాటు డెంగ్యూ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు ప్రబలడం సహజం. వీటిని అరికట్టేందుకు అధికారులు సిద్ధంగానే ఉంటారు. కానీ కరోనా చాప కింద నీరులా ప్రబలుతుండగానే వానకాలం వచ్చింది.  కరోనా, సీజనల్‌ వ్యాధులు క‌లిసిపోతాయ‌ని అవుతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఒకే వ్యక్తికి డెంగ్యూ, మలేరియా, స్తెన్‌ ఫ్లూ వంటి సీజనల్‌ వ్యాధులతో పాటు కరోనా కూడా సోకితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న వైద్యులను ఆందోళనకు గురిచేస్తోంది.

 

 

వానకాలం, చలికాలంలో వాతావరణం మారినప్పుడు మనిషి శరీరంలోని తెల్లరక్త కణాలతోపాటు ఇమ్యునో గ్లోబిలిన్స్‌ బలహీనపడతాయి. రోగ నిరోధక శక్తి సహజంగానే తగ్గిపోతుంది. వ్యాధులు సులువుగా అంటుకుంటాయి. తొలకరి వాన కురిసినప్పుడు భూమి లోపలి బ్యాక్టీరియాలు ఉపరితలానికి వచ్చి కలిసి నీరు కలుషితం అవుతుంది. నీటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. గాలి ద్వారా హానికర మైక్రో ఆర్గానిజమ్స్‌ వ్యాప్తిచెంది రకరకాల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు జాగ్రతలు తీసుకోవాలి. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. భౌతికదూరం పాటించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: