అనంత‌పురం జిల్లా. ఈ జిల్లా పేరు త‌లుచుకోగానే.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఛాతీ ఇడ్లీ పిండి మాదిరి గా ఉబ్బి పోతుంది. అంత‌బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉన్న జిల్లా కావ‌డ‌మే ఆయ‌న ఆనందానికి కార‌ణం. అలాంటి జిల్లాలో అంత‌టి బ‌ల‌మైన నాయ‌కులు ఉన్న జిల్లాలో .. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం ప‌ట్టు సాధించిన‌ట్టే సాధించి.. ప‌ట్టు కోల్పోతోంది. ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టి.. క‌దిరి.  మ‌రి ఇక్క‌డ నాయ‌కు లు లేరా అంటే.. యువ నాయ‌కుడు కందికుంట వెంక‌ట ప్ర‌సాద్ ఉన్నారు. గతంలోనూ ఆయ‌న ఇక్క‌డ విజ‌యం సాధించి.. వైఎస్ హ‌వా ఉన్న 2009లోనే గెలుపు గుర్రం ఎక్కి టీడీపీ స‌త్తా చాటారు.

 

ఇక‌, ఆ త‌ర్వాత నుంచి జ‌రిగిన రెండు ఎన్నిక‌ల్లో టీడీపీ గెలుపు ఆశ‌ల‌ను మించ‌డం లేదు. వాస్త‌వానికి టీడీపీ ఆవిర్భ‌వించిన ఏడాదిలోనే మ‌హ‌హ్మ‌ద్ షాకిర్ ఇక్క‌డ నుంచి సైకిల్ గుర్తుపై పోటీ చేసి గెలిచారు. ఆ త‌ర్వాత .. 1994లో సుర్య‌నారాయ‌ణ టీడీపీ త‌ర‌ఫున గెలుపు గుర్రం ఎక్కారు. ఇక‌, ఆ త‌ర్వాత మ‌ళ్లీ 2009లో కందికుంట గెలిచారు. ఇలా పార్టీ పెట్టిన త‌ర్వాత మూడు సార్లు మాత్రమే ఇక్క‌డ టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. కానీ, ఇదే అనంత‌పురం జిల్లాలో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ స్థాపించిన నాటి నుంచి గెలుస్తూనే ఉంది. మ‌రి క‌దిరికి ఏమైంది?  మ‌ళ్లీ ఇక్క‌డ టీడీపీ గెలుస్తుందా?  లేదా? అనే సందేహం వెంటాడుతోంది.

 

నిజానికి గ‌తేడాది ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున బ‌రిలో దిగిన కందికుంట విజ‌యం సాధిస్తార‌ని అంద‌రూ అను కున్నారు. కానీ, చంద్ర‌బాబు చేసిన త‌ప్పుల కార‌ణంగా.. పార్టీ రెండువ‌ర్గాలుగా చీలిపోయింద‌నే భావ‌న ఉంది. 2014లో వైసీపీ నుంచి గెలిచిన అక్త‌ర్ చాంద్ బాషాను చంద్ర‌బాబు త‌ర్వాత కాలంలో త‌న పార్టీలోకి తీసు కున్నారు. మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని ఇవ్వ‌లేద‌న్న టాక్ వ‌చ్చింది. అయితే చంద్ర‌బాబు ఆయ‌న‌కు విప్ ప‌ద‌వి ఇచ్చినా ఆయ‌న వ‌ల్ల టీడీపీకి ఒరిగిందేమి లేదు. దీంతో క‌దిరిలో రెండు టీడీపీ వ‌ర్గాలు ఏర్ప‌డ్డాయి. ఒక‌వైపు సుదీర్ఘ‌కాలంగా ఉన్న కందికుంట‌.. మ‌రోవైపు వైసీపీ నుంచి వ‌చ్చిన బాషా.. కార‌ణంగా పార్టీలో అనిశ్చితి ఏర్ప‌డింది.

 

ఇక‌, ఎన్నిక‌ల స‌మ‌యానికి తాను సిట్టింగ్ కాబ‌ట్టి..త‌న‌కే టికెట్ ఇవ్వాల‌ని బాషా కోరారు. అయితే పార్టీ కోసం నియోజ‌క‌వ‌ర్గంలో రెండు ద‌శాబ్దాలుగా క‌ష్ట‌ప‌డ‌డంతో పాటు ఎప్పుడూ క‌మిట్‌మెంట్‌తో ఉన్న‌ కందికుంట‌కే చంద్ర‌బాబు మొగ్గు చూపారు. 2014 ఎన్నిక‌ల్లో కందికుంట చాలా స్ప‌ల్ప తేడాతో మాత్ర‌మే ఓడిపోయారు. దీంతో పార్టీలో కార్య‌క‌ర్త‌లు రెండుగా చీలిపోయారు. కందికుంట‌కు వ్య‌తి రేకంగా గ్రౌండ్ లెవిల్లో ప్ర‌చారం సాగింద‌ని అదే కందికుంటకు యాంటీ అయింద‌నే విశ్లేష‌ణ‌లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. బాషా పార్టీని ప‌ట్టించుకోవ‌డం లేదు. 

 

కందికుంట మాత్రం పార్టీకి ఒకింత ఆద‌రువుగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే అనంత‌పురం జిల్లాలోనే టీడీపీ గెలిచిన హిందూపురంను ప‌క్క‌న పెడితే టీడీపీ క్షేత్ర‌స్థాయిలో బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం క‌దిరి. అందుకు కందికుంట కేడ‌ర్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ట్టించుకోవ‌డంతో పాటు వారి బాగోగుల‌ను అనుక్ష‌ణం ప‌ట్టించుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఇక అత్తార్ చాంద్ భాషా పూర్తిగా పార్టీని గాలికి వ‌దిలేశార‌ని నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ కేడ‌ర్ చ‌ర్చించుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: