ఆఫ్రో అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా అగ్రరాజ్యంలో ఆందోళనలు వెల్లువెత్తాయి. ఏకంగా శ్వేతసౌధం దగ్గరే నిరసనకారులు బీభత్సం సృష్టించడంతో.. అధ్యక్షుడు ట్రంప్ గంట పాటు బంకర్లోకి వెళ్లాల్సి వచ్చింది. జార్జ్ ఫ్లాయిడ్ మృతితో రేగిన ఆందోళనలకు సమాధానంగా తుపాకులు గర్జిస్తాయని ట్రంప్ చేసిన ట్వీట్లు.. అగ్నికి ఆజ్యం పోశాయి. 

 

ఆఫ్రికన్‌ - అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతికి నిరసనగా అమెరికాలో జరుగుతున్న నిరసనలు  తీవ్రరూపం దాల్చాయి. నిరసనకారులు ఏకంగా అధ్యక్ష భవనం వైట్‌ హౌస్‌‌ ముందుకు చేరుకోవడంతో కలకలం రేగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిపైకి భాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది. దాదాపు వెయ్యి మంది నిరసనకారులు.. పోలీసులు ఏర్పాటు చేసిన ప్లాస్టిక్‌ బారికేడ్లను ధ్వంసం చేశారు. వాటికి నిప్పంటించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆ పరిసరాల్లో ఉన్న అమెరికా జాతీయ జెండాను తీసి మంటల్లో వేశాడు. కొంతమంది వైట్‌ హౌజ్‌పైకి రాళ్లు రువ్వే ప్రయత్నం చేశారు.

 

నిరసనకారుల ఆందోళనలు ఉధృతం కావడంతో.. వైట్‌ హౌస్‌ సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు అప్రమత్తమయ్యారు. పరిస్థితులు చేదాటకముందే అధ్యక్షుడు ట్రంప్‌ను ఉగ్ర దాడుల వంటి అత్యవసర సమయంలో ఉపయోగించే రహస్య బంకర్‌లోకి తీసుకెళ్లారు. దాదాపు గంటపాటు ఆయన్ని అక్కడే ఉంచారు. నిరసనకారుల ఆగ్రహావేశాలను ట్రంప్ బృందం ఆందోళనకు గురైంది. ట్రంప్ భార్య మెలనియా, కొడుకు బారన్‌ ట్రంప్‌ను కూడా బంకర్‌లోకి తీసుకెళ్లారా అన్న దానిపై స్పష్టత లేదు. అధ్యక్షుడు బంకర్‌లోకి వెళ్లడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. కేవలం తీవ్రవాద దాడుల హెచ్చరికలప్పుడు మాత్రమే ఇలా చేస్తారు. 

 

మినియాపోలీస్ లో ఆఫ్రో అమెరికన్ జార్జి ఫ్లాయిడ్ మృతికి పోలీసులు కారణమైన తరుణంలో.. అలర్లు,ఆందోళనలతో అమెరికా అట్టుడుకుతోంది. అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్లు అగ్నికి మరింత ఆజ్యం పోశాయి. ఆందోళనకారులపై కుక్కలను ఉసిగొల్పుతాం..లూటీలు ఆపకపోతే  తుపాకులు గర్జిస్తాయంటూ ట్రంప్‌ ట్వీట్‌తో రెండు రోజులుగా వైట్‌హౌజ్‌ ముందు ఆందోళనలు వెలువెత్తుతున్నాయి.  ఆందోళనకారులను ఆపేందుకు సీక్రెట్‌ సర్వీస్‌ పోలీసులు యత్నించారు. విద్యుత్‌ నిలిపివేయడంతో వైట్‌హౌస్ లో రాత్రి కొంతసేపు అంధకారం నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: