దేశవ్యాప్తంగా ప్యాసింజర్ రైళ్లు పట్టాలెక్కాయి. ఇప్పటిదాకా శ్రామిక్ స్పెషల్స్ నడుస్తుండగా.. వీటికి తోడు ఎక్స్ ప్రెస్ రైళ్లకు కూడా కేంద్రం పచ్చజెండా ఊపింది. దీంతో ప్రధాన నగరాల మధ్య రైళ్లు పరుగులు తీస్తున్నాయి. కోవిడ్ నిబంధనలు తప్పనిసరి చేయడంతో.. ప్రతి రైల్వే స్టేషన్ దగ్గర భారీగా క్యూలు దర్శనమిచ్చాయి. 

 

దేశంలో రైలు బండి మళ్లీ కూతపెట్టింది. లాక్‌డౌన్‌తో రెండు నెలలకు పైగా షెడ్లకే పరిమితమైన రైళ్లు.. ఇప్పుడు పట్టాలెక్కాయి. వలస కార్మికులను తరలించేందుకు.. నడుస్తున్న కొన్ని శ్రామిక్ రైళ్లు తప్ప.. రెండు నెలలుగా ఒక్క రెగ్యులర్ ట్రైన్ కూడా నడవలేదు. ఎట్టకేలకు లాక్‌డౌన్‌ సడలింపులతో రాజధాని రైళ్లు తప్ప.. దాదాపు మిగతా రైళ్లన్నీ పట్టాలెక్కాయి. జూన్ 1న తొలి రోజు దేశవ్యాప్తంగా రెండు వందల రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. లక్షా 45 వేల మంది తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. 

 

మొదటి రైలు ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ రైల్వే స్టేషన్‌ నుంచి మహానగరి ఎక్స్‌ప్రెస్‌.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి అర్ధరాత్రి బయలుదేరింది. ప్రయాణికులంతా రైలు బయలుదేరే సమయానికి 90 నుంచి 120 నిమిషాల ముందే రావాలని సూచించండంతో.. అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి. అయితే భౌతిక దూరం పాటించేలా స్టేషన్లలో ఏర్పాట్లు చేశారు. నిరంతరం పోలీసులు, ఇతర వైద్యారోగ్య సిబ్బంది పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

 

దక్షిణమధ్య రైల్వే పరిధిలో ఎనిమిది రైళ్లు నడుస్తున్నాయి. హైదరాబాద్ న్యూఢిల్లీ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ తొలి కూత పెట్టింది. తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌తో పాటు.. సచ్‌ఖండ్, దానాపూర్, గోల్కొండ, హుస్సేన్ సాగర్, ఫలక్‌నుమా, రాయలసీమ, గోదావరి ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయి. వీటితో పాటు.. దక్షిణ మధ్య రైల్వే పరిధి మీదుగా రాకపోకలు సాగించే సికింద్రాబాద్ - నిజాముద్దీన్ దురంతో ఎక్స్‌ప్రెస్‌, ముంబై - భువనేశ్వర్ కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

 

తెలుగురాష్ట్రాల్లో ఏడు ఎక్స్ ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్‌-గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, హైదరాబాద్‌-న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌, హైదరాబాద్‌-విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్‌ నడుస్తున్నాయి. అలాగే  హైదరాబాద్‌-ముంబై హుస్సేన్‌సాగర్‌ ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌-దానాపూర్‌ దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌, నిజామాబాద్‌-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌  కూడా అందుబాటులో ఉన్నాయి. 

 

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసి పోయింది ..లాక్ డౌన్ అనంతరం రైల్వే స్టేషన్ నుంచి కొన్ని రైళ్లకు అనుమతిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది ...దీంతో ఈ రోజు ప్రారంభం కానున్న రైళ్ల కోసం ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు.. టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత రైల్వే స్టేషన్ కు తరలి వచ్చారు..భౌతిక దూరం పాటిస్తూ వారిని  స్టేషన్ బయట నుంచి నిల్చోబెట్టడం  తో భారీ క్యూ లైన్లు దర్శనమిచ్చాయి .వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించడంతో పాటు టికెట్ కన్ఫర్మ్ అయిన వారిని లోపలికి అనుమతించారు పోలీసులు. 

 

గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 6 గంటలకు గోల్కొండ ఎక్స్ ప్రెస్ ప్రారంభం అయ్యింది. సాయంత్రం ఫలక్ నామ ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్ నుంచి గుంటూరు వచ్చింది. ప్రతి రోజూ ఈ రెండు సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: