ఏపీలో వైసీపీ పాలనకు ఏడాది పూర్తైన తరుణంలో.. బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. జగన్ హయాంలో కూడా అవినీతి కొనసాగుతోందని, ఆయనకు పదవిలో కొనసాగే హక్కు లేదని మండిపడింది. కేంద్ర పథకాలను తనవిగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించింది కాషాయ పార్టీ. 

 

ఏపీలో సీఎం జగన్ ఏడాది పాలనలో అనుభవ రాహిత్యం, అసమర్థత స్పష్టంగా కనిపించాయని ఏపీ బీజేపీ ఆరోపించింది. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే హక్కు జగన్‌ మోహన్‌ రెడ్డికి ఏ మాత్రం లేదని.. తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. 2019లో ప్రజలు నమ్మి జగన్‌కు అవకాశం ఇస్తే.. ఇప్పుడు తన అసలు రూపం చూపిస్తున్నారని మండిపడ్డారు. కౌన్సిల్‌లో తనకు వ్యతిరేకంగా బిల్లు పెట్టి సెలెక్ట్ కమిటీకి పంపినందుకు ఏకంగా మండలినే రద్దు చేయడం జగన్ అహంకారానికి నిదర్శనమన్నారు కన్నా. అవినీతి చక్రవర్తి చంద్రబాబు నాయుడు అని గత ఐదేళ్లలో పుస్తకాలు ముద్రించి కేంద్రం చుట్టూ తిరిగిన జగన్.. ఏడాది కాలంలో ఆ అవినీతిపై విచారణ ఎందుకు జరిపించలేదని నిలదీశారు. స్థానిక ఎన్నికల్లో బెదిరింపులు, భయోత్పాతం సృష్టించి ప్రక్రియను అస్తవ్యస్తం చేశారన్నారు. సాక్షాత్తూ ఎన్నికల కమిషనర్‌కే కులం ఆపాదించడం చూస్తుంటే జగన్ అహంకారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని దుయ్యబట్టారు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ప్రభుత్వం వెంటనే రమేశ్‌ కుమార్‌ను తిరిగి ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించేలా చూడాలని కన్నా విజ్ఞప్తి చేశారు. 

 

కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఏపీ ప్రభుత్వం పేర్లు మార్చి ప్రజలను మభ్య పెడుతోందని  విమర్శించారు బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు. గతంలో టీడీపీ ప్రభుత్వం చేసినట్లుగానే వైసీపీ ప్రభుత్వం కూడా  అదే బాటలో పయనిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

ఏపీలో బీజేపీ వస్తేనే అభివృద్ధి, సంక్షేమం రెండూ సాధ్యమౌతాయని చెప్పారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్. కేంద్రంలో ఏడాది పాలనలో మోడీ చరిత్రలో కనీవినీ ఎరుగని పనులు చేశారని, ఏపీలో కూడా ప్రజలు బీజేపీ రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల ప్రజలు కూడా కాషాయ పార్టీ వైపు చూస్తున్నారని ఆ పార్టీ నేతలు చెప్పుకున్నారు. జగన్ ఇప్పటికైనా పాలనా పద్ధతి మార్చుకోవాలని సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: