ఇప్పుడు అంద‌రి చూపు లాక్ డౌన్ 5.0లో ద‌క్కిన స‌డ‌లింపుల గురించే. కంటైన్మెంట్‌ జోన్లు మినహా ఈ నెల 8 నుంచి అన్నిచోట్ల తిరిగి ప్రారంభించుకోవచ్చని కేంద్రం అనుమతిచ్చింది. నాలుగు ద‌శ‌ల లాక్ డౌన్ అనంత‌రం క‌లిగిన ఈ వెసులుబాటును స‌ద్వినియోగం చేసుకునేందుకు ప్ర‌జ‌లు ఆస‌క్తిక‌గా ఎదురుచూస్తున్నారు. లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా మూతబడిన హోటళ్లు, రెస్టారెంట్లు ఎట్టకేలకు తెరుచుకోనున్నాయి. దీంతో ఇటు వినియోగ‌దారుల‌కు అటు యాజమాన్యాలకు పెద్ద ఉప‌శ‌మ‌నం ద‌క్క‌నుంది.

 


నూత‌న నిబంధ‌న‌ల‌తో హోటల్‌, రెస్టారెంట్లు ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. దీనిప‌ట్ల‌‌ యాజమాన్యాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. లాక్‌డౌన్‌ దగ్గర్నుంచి ప్రభుత్వంతో తాము కలిసి పనిచేస్తున్నామ‌ని పేర్కొంటూ వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి వసతి సదుపాయాలను కల్పించామ‌ని వెల్ల‌డిస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జూన్‌ 8 నుంచి సేవలను అందుబాటులోకి తెస్తామ‌ని చెప్తున్నారు. అయితే, కొవిడ్‌-19 నిబంధనలు కచ్ఛితంగా పాటిస్తూ సేవలందించడం సవాల్‌తో కూడుకున్నదేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా చిన్నాచితకా రెస్టారెంట్లు కోలుకొనేందుకు 12-18 నెలల సమయం పట్టవచ్చన్న అంచనాలు పరిశ్రమ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

 

 

ఇదిలాఉండ‌గా, లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో ఎవరికివారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం ద్వారానే కరోనాకు దూరంగా ఉండగలుగుతారని వైద్య విభాగాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా కార్యాలయాలు, వ్యాపార కేంద్రాలు, పని ప్రదేశాల్లో మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అధికారులు చెప్తున్నారు. అందులో భాగంగానే కార్యాలయాల్లో ప్రత్యేక విధానాలను అవలంబించాలని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పలు సూచనలు చేసింది. కార్యాలయానికి వచ్చే ప్రతి ఉద్యోగి జ్వరాన్ని తప్పనిసరిగా పరీక్షించాలి. జ్వరం, దగ్గు, జలుబు వంటి ఉంటే అవి తగ్గే వరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని చెప్పాలి. పని ప్రదేశంలో గాలి, వెలుతురు బాగా ఉండేలా ఏర్పాట్లుండాలి. శానిటైజర్‌ అందుబాటులో ఉండాలి. రోజుకు 3 నుంచి 4 సార్లు సోడియం హైపోక్లోరైట్‌తో టేబు ళ్లు, డోర్‌ హ్యాండిల్స్‌, హ్యాండ్‌ రేలింగ్‌, నల్లాలు వంటివి శుభ్రం చేయాలి. ఎవరైనా సిబ్బందిలో కరోనా లక్షణాలు కనిపించినా లేదా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌ అని తేలినా మొత్తం ప్రాంగణాన్ని డిస్‌ ఇన్ఫెక్ట్‌ ద్రావణంతో శుభ్రం చేయాలి. కరోనాపై ఉద్యోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ కార్యాలయంలోని ముఖ్యమైన ప్రదేశాల్లో ఏర్పాటుచేయాలి. వైరస్‌ సోకకుండా జాగ్రత్త చర్యలు అమలయ్యేలా కార్యాలయంలో నోడల్‌ అధికారిని నియమించాలని స్ప‌ష్టం చేసింది. ఇలా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూనే మ‌న‌మంతా ఆరోగ్యంగా ఉండ‌గ‌లం. కాబ‌ట్టి పాటించాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: