ఏపీ రాజకీయాల్లో సోషల్ మీడియా చాలా ముఖ్యపాత్ర పోషిస్తుందనే విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో కార్యకర్తలు పార్టీల వారీగా ఉంటూ, ప్రత్యర్ధి పార్టీలపై తీవ్ర విమర్శలు, ట్రోల్స్ చేస్తుంటారు. అయితే సోషల్ మీడియాలో వార్‌ ఎక్కువగా టీడీపీ, వైసీపీల మధ్యే నడుస్తోంది. మొన్నటివరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడూ వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు, లోకేశ్, ఆ పార్టీ నేతలపై ట్రోల్స్ వేసేవారు.

 

అదే సమయంలో టీడీపీ కార్యకర్తలు కూడా జగన్‌, వైసీపీ నేతలపై విమర్శలు చేసేవారు. అయితే అప్పుడు టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి, వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు. దీనిపై జగన్ కూడా స్పందిస్తూ తమ కార్యకర్తలకు అండగా ఉంటూనే, విమర్శ చేస్తే అరెస్ట్ చేస్తారని ఫైర్ అయ్యారు. ఇక 2019 ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది. వైసీపీ అధికారంలోకి వస్తే, టీడీపీ ప్రతిపక్షంలోకి వచ్చింది.

 

ఇక్కడ నుంచి టీడీపీ కార్యకర్తలు సీఎం జగన్‌పై, ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ట్రోల్స్ చేస్తూ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని చెబుతూ, పలువురు టీడీపీ కార్యకర్తలని అరెస్ట్ చేశారు. పలువురికి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికీ ఈ కార్యక్రమం అలాగే కొనసాగుతుంది. ఇక దీనిపై చంద్రబాబు ఎప్పటికప్పుడు స్పందిస్తూ తమ కార్యకర్తలని ఇబ్బంది పడితే చూస్తూ ఊరుకోమని, వారికి అండగా ఉంటామని ప్రకటనలు చేస్తున్నారు. ఆయన చెప్పిన విధంగానే అరెస్ట్ అయిన కార్యకర్తలకు అండగా ఉంటున్నారు.

 

కాకపోతే వైసీపీ కార్యకర్తలు కూడా చంద్రబాబు, లోకేశ్‌లపై దారుణ విమర్శలు చేస్తున్నారు. కానీ వారు అధికారంలో ఉన్నారు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. ఇదే సమయంలో ఈ మధ్య హైకోర్టు తీర్పులపై కొందరు వైసీపీ నేతలతో పాటు, కార్యకర్తలు సంచలన కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారికి నోటీసులు పంపింది. అయితే తమ కార్యకర్తలకు ఏం కాకుండా తాను చూసుకుంటానని, అండగా ఉంటానని విజయసాయిరెడ్డి చెప్పారు.

 

టీడీపీ హయాంలో ఆ పార్టీ కార్యకర్తలు అడ్డగోలుగా పెట్టిన పోస్టులకు..  కేసులు పెట్టి అరెస్ట్‌ చేసి ఉంటే ఎన్ని జైళ్లు అయినా సరిపోవని మాట్లాడారు. అయితే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే విషయంలో రెండు పార్టీలది అడ్డుగోలు వ్యవహారంగానే ఉందని రాజకీయ విశ్లేషుకులు అంటున్నారు. వారు పెట్టే పోస్టులు చాలా దారుణంగా ఉంటున్నాయని, ఎప్పుడైనా నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తే బాగుంటుందని అలా కాకుండా వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని హితవు పలుకుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: