తెలంగాణ లో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి .  కేంద్ర , రాష్ట్ర  ప్రభుత్వాలు ఆంక్షలు సడలించిన తరువాత  కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది . అయినా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ -5 లో భాగంగా కేంద్రం  ఇచ్చిన సడలింపులు యధావిధంగా అమలు చేయాలని నిర్ణయించడం స్థానికులను విస్మయానికి గురి చేస్తోంది . రాష్ట్రం లో కరోనా వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం ఆంక్షలను తీవ్రతరం చేస్తుందని అందరూ భావించారు .

 

కానీ రాష్ట్ర  ప్రభుత్వం మాత్రం ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్పి , లాక్ డౌన్ ఆంక్షలను సరళతరం చేసింది . దీనితో   ఆదివారం రాష్ట్రం లో  ఏకంగా 199 కేసులు నమోదు కాగా , సోమవారం 94 కేసులు నమోదయినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు . కేవలం రెండు రోజుల్లో దాదాపు 300 కేసులు నమోదయిన కూడా ప్రభుత్వం, లాక్ డౌన్ ఆంక్షల అమలులో ఉదాసీనంగా వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది .  రాష్ట్రలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న , మద్యం విక్రయాలకు రాత్రి ఎనిమిది గంటల వరకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సామాన్యులను విస్మయానికి గురి చేస్తోంది .

 

మద్యం విక్రయాలను ఇప్పటి వరకు  సాయంత్రం ఆరు గంటల వరకు అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వం , తాజాగా లాక్ డౌన్ -5 లో భాగంగా కేంద్రం ఇచ్చిన సడలింపులను  ఆధారంగా చేసుకుని  , మద్యం దుకాణాలను ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతించడంతో పాటు , విక్రయాలు జరపవచ్చునని ఉత్తర్వులు జారీ చేసింది . మద్యం విక్రయాలకు రాత్రి ఎనిమిది గంటల వరకు అనుమతించడాన్ని విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి . ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి . 

మరింత సమాచారం తెలుసుకోండి: